జనసేన 2014లో పోరాటాల గడ్డ తెలంగాణలో ప్రారంభించాం అని, ఆంధ్రప్రదేశ్‌లో నిలదొక్కుకున్నాం అని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సగటు మనిషి కోపం నుంచి పుట్టిందే జనసేన పార్టీ అని చెప్పారు. కులం, కుటుంబం, రాష్ట్రం, ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదన్నారు. ప్రజల కష్టాలు పరిష్కరించినప్పుడు తన నిర్ణయం సరైందే అనిపించిందన్నారు. పార్టీ మొదలుపెట్టినప్పుడు తన ఆలోచన సగటు మనిషి ఆలోచన అని.. జనాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆకాంక్షలు అర్థం చేసుకుని పార్టీ పెట్టానన్నారు. దశాబ్ద కాలం పాటు పార్టీ నడిపాను అని, జనసేన పెట్టిన తరవాత కుటుంబాన్ని విస్మరించానని, సినిమాలపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయానన్నారు. ఏరోజు కూడా పార్టీని, జనసైనికులను, వీరమహిళలను విడిచిపెట్టలేదని పేర్కొన్నారు. పార్టీ పెట్టినప్పుడు 150 మంది మాత్రమే తన వెంట ఉన్నారని.. ఈరోజు 18 వేల మంది క్రియాశీలక వాలంటీర్లు, 12 లక్షల మంది జనసేన క్రియాశీలక సభ్యులుగా జనసేన ఎదిగిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
ఈరోజు విశాఖలో నిర్వహించిన ‘సేనతో సేనాని’ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘ప్రముఖ మల్ల యోధుడు, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి గొప్ప కీర్తి తీసుకొచ్చిన కోడి రామ్మూర్తి నాయుడు గారి పేరు మీద ఒక ముఖ ద్వారం ఈ సభకు పెట్టాం. నేను ప్రజలను అర్థం చేసుకోగలను, అందుకే తెలంగాణ నల్లమల చెంచు కుటుంబానికి చెందిన శివ లాంటి యువకులు నా వెంట నిలిచారు. ఇలాంటి ఎంతో మంది నిస్వార్థ జనసైనికులు మన వెంట నడిచారు. జనసేన ధైర్యం మీద నిలబడిన పార్టీ. జాతీయ పార్టీ తాలూకు లక్షణాలున్న ప్రాంతీయ పార్టీ. జాతీయ సమగ్రతను నిలువెల్లా నింపుకున్న పార్టీ. ఖుషీ సినిమా విజయాన్ని చూసిన తరవాత నా పని అయిపోయింది అనిపించింది. దేని మీద ఫోకస్ చేయలేకపోయాను. నిజ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఇకపై మండల కార్యాలయాల స్థాయి వరకు నేనే వచ్చి రివ్యూ చేసే వ్యవస్థ తీసుకురానున్నాను. ఓటమి నాకు నా వారు ఎవరో నేర్పించింది. ఒక్క ఓటమితో నత్త గుల్లలు రాలిపోయాయి. నిజమైన బలమైన నాయకులు నా వెంట నిలబడ్డారు’ అని డిప్యూటీ సీఎం చెప్పారు.
Also Read: Bhuvneshwari Kumari: ‘కాస్తైనా సిగ్గుండాలి’.. లలిత్ మోడీపై శ్రీశాంత్ సతీమణి ఫైర్!
‘కేవలం ఐడియాలజీ మాట్లాడి ఆగిపోయిన పార్టీలు చాలా ఉన్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాలే చూసిన పార్టీలు చాలా ఆగిపోయాయి. కానీ జనసేన పార్టీకి ఐడియాలజీతో పాటుగా రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. అందుకే 2024 ఎన్నికల్లో 100 శాతం విజయం సాధించాం. 2014లో పార్టీ పెట్టాక 7 అంశాల సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేక ఇదేం ఐడియాలజీ అన్నారు. కానీ జనసైనికులు నమ్మారు, నడిచారు, అర్థం చేసుకున్నారు, ఈరోజు ఘన విజయంతో నిలబడ్డాం. సినిమాలు చేసే వారు రాజకీయాలు చేయకూడదా?. సినిమాలు చేస్తాం కానీ మా గుండెల్లో సమస్యలపై ఆలోచన, పోరాట స్ఫూర్తి జ్వలిస్తూనే ఉంది. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని చెప్పిన కమ్యూనిస్టు దేశాలు ఈరోజు ఏ రాష్ట్రం కార్మికులు ఆ రాష్ట్రం లోనే పని చేయాలి అన్నారు. కేవలం విప్లవం మాత్రమే మార్పు తీసుకోరాదు. దానికి ఆలోచన ఉండాలి. దానికి నక్సలైట్ అవ్వాల్సిన అవసరం లేదు. విప్లవంతో కూడిన రాజకీయం చేస్తూ కూడా ట్రైబల్స్ గ్రూప్ వారికి అభివృద్ధి చేసి చూపించవచ్చు అని నిరూపించాం. కమ్యూనిస్టులు విధానాలు మార్చుకుంటున్నప్పుడు మన కమ్యూనిస్టులు మాత్రం నేను విధానం మార్చా అంటున్నారు. 100 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తే ఇప్పుడు మన ఐడియాలజీ నిజం అని నమ్మారు’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
