అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. వెంటనే మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి అతడిని పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు.
సిద్దూ ఆవిష్కరించిన సైకిల్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా నడిపారు. సైకిల్‌పై సిద్ధూని కూర్చోబెట్టుకొని క్యాంపు కార్యాలయంలో రౌండ్స్ వేశారు. ఈ సందర్భంగా బ్యాటరీ సైకిల్ గురించి సిద్దూని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతని ఆలోచనలు తెలుసుకుని డిప్యూటీ సీఎం అబ్బురపడ్డారు. సిద్ధూ రూపొందించిన గ్రాసరీ గురూ వాట్సప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు. సిద్ధూ ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని ఆకాంక్షిస్తూ.. రూ.లక్ష ప్రోత్సాహకం అందించారు.
Also Read: Pawan Kalyan: జనసేనలోకి వైసీపీ జెడ్పీటీసీలు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్!
విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ సుదూరంలో ఉన్న కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాలేజీ వెళ్లేందుకు స్వయంగా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాడు. మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే.. 80 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. సిద్ధూ తయారు చేసిన ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందరూ సిద్ధూని ప్రశంసిస్తున్నారు. భవిషత్తులో మరిన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
