NTV Telugu Site icon

Pawan Kalyan: నన్ను అరెస్ట్ చేసుకోండి.. చిత్రవధ చేసుకోండి.. రెడీ..

Pk

Pk

Pawan Kalyan: వాలంటీర్లపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. ఫిర్యాదుకు రంగం సిద్ధం చేస్తోంది.. సంబంధిత కోర్టులో ఫిర్యాదు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్‌ చేసిన హ్యూమన్‌ ట్రాఫికింగ్ ఆరోపణలను సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం.. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు సూచించింది.. ఈ పరిణామాలపై స్పందించిన పవన్‌ కల్యాణ్.. నన్ను ప్రాసిక్యూషన్‌ చేయాలనుకుంటే చేసుకోండి.. నేను రెడీ అని ప్రకటించారు.. వైసీపీ నేత పంచకర్ల రమేష్ బాబు.. జనసేన పార్టీలో చేరిన సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. నన్ను ప్రాసిక్యూట్ చేయమని ప్రభుత్వం జీవో జారీ చేసింది. నేనోసారి మాట చెప్పానంటే అన్ని రిస్కులు తీసుకునే చెబుతాను. నన్ను అరెస్ట్ చేసుకోండి.. చిత్రవధ చేసుకోండి నేను సిద్ధమే అన్నారు. నేను ఏపీ అభివృద్ధికి కమిట్ మెంటుతో ఉన్నాను. నన్ను ప్రాసిక్యూషన్ చేయాలనుకుంటే చేయండి.. నేను సిద్దమే అని స్పష్టం చేశారు.

ఇక, మర్డర్లు చేసిన వారికి ప్రాసిక్యూషన్ ఉండదా..? అని ప్రశ్నించారు పవన్‌.. పొరపాటున మానభంగాలు జరిగిపోతాయనే మంత్రులున్నారు.. వారిని ప్రాసిక్యూట్ చేయరా..? అని ప్రశ్నించారు. రెడ్ క్రాస్ వంటి సంస్థకు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా సేవలు అందించే వారిని వలంటీర్లు అంటారు. రూ. 5 వేల వేతనం తీసుకునే వాళ్లని వలంటీర్లు అనకూడదన్న ఆయన.. వలంటీర్ల ద్వారా సేకరిస్తోన్న సమాచారం ఎక్కడకెళ్తోంది.. వలంటీర్ల ద్వారా జరుగుతోన్న డేటా చౌర్యంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చెప్పాను. ఏపీలో డేటా చోరీపై కేంద్రానికి ఫిర్యాదు చేశాను. జగన్ చెప్పినట్టు చేస్తే వలంటీర్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని వార్నింగ్‌ ఇచ్చారు.

ప్రజలపై నిఘా పెడుతున్నారు. డేటా ద్వారా దోపిడీ.. దొంగతనం చేస్తారు అని ఆవేదన వ్యక్తం చేశారు పవన్‌.. ఏపీ ప్రజల డేటా FOA కంపెనీకి వెళ్తోంది. FOA కంపెనీ ఎవరిది..? అని ప్రశ్నించారు.. డేటా చాలా కీలకమైంది. డేటాను ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు.. ఇది చట్ట విరుద్దం. ఏ జీవో కింద డేటాను ప్రైవేట్ ఏజెన్సీలకిచ్చారు..? అని నిలదీశారు. నన్ను ప్రాసిక్యూట్ చేస్తానంటున్నారు.. ఇది ఇక్కడితో ఆగదు.. జగన్ ప్రభుత్వం చేసే మైనింగ్ దోపిడీ సంగతేంటీ..? నన్ను ప్రాసిక్యూట్ చేయ్.. నేను ఎక్కడుంటే అక్కడికి పోలీసులు పంపించు.. నేనేం భయపడను. ఇలాంటి కేసులకు భయపడితే పార్టీ ఎందుకు పెడతాను..? ఏపీ ప్రజల కోసం అన్ని పణంగా పెట్టే వచ్చాను అని స్పష్టం చేశారు. ఓ వాలంటీర్ ఎనిమిదేళ్ల బిడ్డను రేప్ చేస్తే.. బాధ్యత ఎవరిది..? దీనికేమన్నా వ్యవస్థ ఉందా..? వాలంటీరుకు అధిపతి ఎవరు..? జగనా..? అని ప్రశ్నించారు. FOA సంస్థలో పని చేసే ఉద్యోగులకూ చెబుతున్నాను.. డేటా తీసుకునే హక్కు లేదు. వాలంటీర్ల మీద వైసీపీ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇక, జనవాణి కార్యక్రమం ప్రారంభం కావడానికే కారణం వాలంటీరే అన్నారు పవన్‌.. జగనుకు తన మన అనే బేధం లేదు. తనకు అన్యాయం జరిగిందని ఓ వాలంటీరు ఫిర్యాదు చేస్తే.. ఆమె అన్న అనుమానస్పద స్థితిలో చనిపోయాడు. ఇప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్టు కూడా ఇవ్వలేదట. గతంలోనూ అవినీతి ఉంది.. కానీ కొండలు దోచేసే అవినీతి ఇప్పుడే జరుగుతోంది అని విమర్శించారు. వాలంటీర్లను రూ. 164కు కొనేశావ్ జగన్.. జనసేన యువతకు.. వాలంటీర్లకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.. ప్రజలు బాగుండాలంటే ప్రభుత్వం మారాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి అంటూ పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.