NTV Telugu Site icon

Pawan Kalyan: ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటా.. ఎందుకంటే..?

Pawan 2

Pawan 2

Pawan Kalyan: ఎమ్మెల్యేగా నేను సంపూర్ణ జీతమే తీసుకుంటాను అని ప్రకటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను ప్రజల సొమ్మును తింటున్నాననే బాధ్యతను అనుక్షణం గుర్తుంచుకోవాలనే జీతం తీసుకుంటున్నాను అన్నారు. నేను సరిగా పని చేయకుంటే.. ప్రతి రూపాయికి నన్ను చొక్కా పట్టుకుని నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలి.. అందుకే జీతం తీసుకుంటున్నాను.. తర్వాత నేను తిరిగి ఇచ్చేది ఇచ్చేస్తాను.. వేయింతలు ఇచ్చేస్తాను.. అది వేరే విషయం అన్నారు పవన్‌..

ఇక, చట్టాలను చేసేవాళ్లు ఎలా ఉండాలో చూపిద్దాం.. పార్లమెంటుకు వెళ్లేది పరిచయాల కోసం.. ప్రజల కోసం పని చేయడానికి అని గుర్తుంచుకోవాలని సూచించారు పవన్‌.. పోటీ చేయని నేతలు కూడా అసెంబ్లీకి వెళ్తున్నట్టే. రక్తం ధారపోసిన జనసైనికులు.. గడప దాటని వీర మహిళలు పార్టీని గెలిపించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండేటువంటి విజయం సాధించాం. ఇల్లు అలకగానే పండుగ కాదు.. పండుగ చేసుకునే సమయం కాదన్నారు. ఇది బాధ్యతతో ఉండాల్సిన సమయం. విజయంతో వచ్చే అతిశయం నాకు లేదు.. పార్టీలో ఎవ్వరూ పెట్టుకోవద్దు అని హెచ్చరించారు. కేంద్రంలో కీలక భాగం కాబోతున్నాం.. ఎంపీలు ఉదయ్, బాలశౌరీకి చాలా బాధ్యత ఉంది. ఢిల్లీలో జనసేన ఎంపీల కదలిక.. కామెంట్లను ప్రతి ఒక్కరూ పరిశీలిస్తారు. ఏపీ ప్రజల తరపున లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు పవన్‌ కల్యాణ్..

ఇది అద్భుతమైన విజయం.. పోటీ చేసిన స్థానాలన్నింటినీ గెలుచుకోవడమనేది దాదాపు అసాధ్యం అన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. ఈసారి ఎన్నికలను నడిపింది.. పవన్ తర్వాత సామాన్య జనసైనికులే అన్నారు.. మరోవైపు.. 100 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలని పవన్ అన్నారు.. అదే జరిగిందన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. పోటీ చేసిన ప్రతి సీటు గెలవాలన్న పవన్ మాటల విలువేంటో ఇవాళ అందరికీ అర్థమైందన్నారు. ఇప్పుడు బాధ్యతగా ఎలా పని చేశామో.. అంతకు మించిన స్థాయిలో ఇక నుంచి కూడా పార్టీ కోసం పని చేయాలని సూచించారు నాదెండ్ల మనోహర్‌.