Pawan Kalyan: “గిరిశిఖర గ్రామాల్లో గర్భిణీలు పడుతున్న ఇబ్బందులు చూడలేక, ఏజెన్సీలో డోలీ మోతలు కనిపించకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మిస్తున్నాం” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామమైన నందిగరువులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, కూటమి ప్రభుత్వ అభివృద్ధి మంత్రాన్ని వివరించారు.
READ ALSO: Uttam Kumar Reddy: గ్యాస్‌పై తెలంగాణ ప్రజలకు ఊరట.. మంత్రి కీలక ప్రకటన..
40 గడపల కోసం రూ.2 కోట్లతో రోడ్డు..
లక్షలాది మంది మధ్య ఆవిర్భావ వేడుకలు జరుపుకునే అవకాశం ఉన్నా, కేవలం 40 ఇళ్లు మాత్రమే ఉన్న ఈ మారుమూల గ్రామాన్ని ఎంచుకోవడం వెనుక తన నిబద్ధత ఉందని పవన్ తెలిపారు. “70 ఏళ్లుగా రోడ్డు ముఖం చూడని ఈ గ్రామానికి రూ.2 కోట్లు వెచ్చించి రోడ్డు వేయించాం. ఆ రోడ్డు నాణ్యతను స్వయంగా నేనే పరిశీలించాను. ఇక్కడ కూటమి అభ్యర్థులు గెలవకపోయినా, అభివృద్ధి విషయంలో మేము ఎక్కడా వివక్ష చూపలేదు” అని ఆయన పేర్కొన్నారు. గత పాలకుల హయాంలో అభివృద్ధి కుంటుపడిందని పవన్ మండిపడ్డారు. గత ఎమ్మెల్యే ఏనాడూ మీ గ్రామానికి రాలేదని, మీ కష్టాలను వినలేదని గిరిజనులను ఉద్దేశించి అన్నారు. జల జీవన్ మిషన్ పథకంలో గత ప్రభుత్వం ఏకంగా రూ.4 వేల కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. నిధులు మళ్లించారే తప్ప, గిరిజన గ్రామాలకు నీళ్లిచ్చే ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు.
18 నెలల్లోనే 460 కి.మీ రోడ్లు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లోనే గిరిజన ప్రాంతాల్లో 460 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. “ఇంకా వేయాల్సిన రోడ్లు, కట్టించాల్సిన పాఠశాల భవనాలు చాలా ఉన్నాయి. రాబోయే కాలంలో వాటన్నింటినీ పూర్తి చేస్తాం. ఇక్కడి ప్రజలు, యువత అండగా నిలబడితే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం” అని పిలుపునిచ్చారు. అడవి బిడ్డల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
