Pawan Kalyan: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఓ లాయర్ దాడికి యత్నించాడు. ఈ అంశంపై తాజాగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. హింసకు సనాతనంలో చోటు లేదని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌పామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడి ప్రయత్నాన్ని ఖండించారు. “ఇది అత్యంత కలచివేసే ఘటన.. భావోద్వేగాలు ఎంత ఉన్నా, న్యాయ మార్గం విడిచిపెట్టకూడదు.. న్యాయం భావోద్వేగంతో కాదు, నిబద్ధతతో సాధించాలి.. సనాతన ధర్మం మనకు చట్టానికి గౌరవం చూపాలని నేర్పిస్తుంది.. హింసకు సనాతనంలో చోటు లేదు.. ప్రధాన న్యాయమూర్తి పదవీ గౌరవాన్ని కాపాడటంలో జనసేన అండగా ఉంటుంది..” అని పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
READ MORE: Instagram Maps: ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యాప్ ఫీచర్.. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే?
సుప్రీంకోర్టులో అమానుష ఘటన చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడి జరిగింది. బీఆర్.గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించాడు. గవాయ్‌పై షూ విసిరాడు. దీంతో కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. ‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే’ అని అరుస్తూ ఓ న్యాయవాది దాడికి పాల్పడ్డాడు. ఈ అంశంపై తాజాగా ప్రధాని మోడీ సైతం స్పందించారు. బి.ఆర్. గవాయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని మోడీ తెలిపారు. మన సమాజంలో ఇటువంటి చర్యలకు చోటు లేదు. ఇది చాలా సిగ్గుచేటని అన్నారు. ఈ మేరకు మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. “భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ జీతో మాట్లాడాను. ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇటువంటి చర్యలకు చోటు లేదు. ఇది పూర్తిగా ఖండించదగినది. దాడి జరిగినప్పుడు జస్టిస్ గవాయ్ ప్రశాంతతను ప్రదర్శించినందుకు నేను అభినందించాను. ఇది న్యాయ విలువల పట్ల, మన రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడం పట్ల ఆయన నిబద్ధతను హైలైట్ చేస్తుంది.” అని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
