NTV Telugu Site icon

Pawan Kalyan : మగవాళ్లు భయపడినా.. మహిళలు భయపడకూడదు

Pawan Kalyan

Pawan Kalyan

వ్యవస్థలను నాశనం చేసే వ్యక్తులు సీఎంగా ఉన్నప్పుడు స్త్రీలే తిరగబడాలని, మగవాళ్లు భయపడినా.. మహిళలు భయపడకూడదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇవాళ పవన్‌ మాట్లాడుతూ.. ఏపీలోని ఓ జిల్లాలో మాన భంగాలు చేస్తామని స్త్రీలను బెదిరించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. స్త్రీలు ఇంకా బలహీనంగానే ఉన్నారని, 30 వేల మంది ఆడపిల్లలు ఏపీ నుంచి మాయమైతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పిల్లలు.. మహిళలు చాలా బలహీనంగా ఉన్నారని, స్త్రీలకు సరైన స్థానం ఇస్తాం.. రక్షణ కల్పిస్తామన్నారు. సీఎం నివాసం ఉన్న ప్రాంతంలో అత్యధికంగా క్రైమ్ ఉందన్నారు. దీనిపై మహిళా కమిషన్ మాట్లాడదన్నారు. ఇలాంటి పరిస్థితులుంటే ఎన్ని చట్టాలు పెట్టినా.. స్పందన కార్యక్రమాలు పెట్టినా లాభమేంటీ..? అనకాపల్లి విస్సన్నపేట భూముల పరిశీలనకు వెళ్తే తన బిడ్డను చంపేశారని ఓ మహిళ వచ్చి నాకు చెప్పిందన్నారు.

అంతేకాకుండా.. ‘స్పందన కార్యక్రమంలో చెప్పినా లాభం లేదని వాపోయింది. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న మీకు డేటా ఎక్కడిదని చిత్తూరు జిల్లా ఎస్పీ అడిగారు. బాధితులు వచ్చి నాకు మొరపెట్టుకుంటున్నారు.. వాళ్లిచ్చిన డేటాతోనే నేను మాట్లాడుతున్నానని ఆ ఎస్పీకి చెబుతున్నాను. రుషికొండను ఆక్రమించుకోవడమంటే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను పాటించక పోవడమే. జగన్ పాలన అస్తవ్యస్తంగా ఉంది. మళ్లీ జగన్ వస్తే ఏపీలో ఉండం పారిపోతామని అంటున్నారు. పెట్టుబడులు పెట్టేదే లేదని పారిశ్రామిక వేత్తలు అంటున్నారు. ఈ నేల విడిచి ఎక్కడకు పారిపోతాం. జరుగుతోన్న తప్పులను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. పోరాటాలు చేయకపోతే హక్కులు పొందలేం. ఏపీలో వెట్టి పాలన.. ఫ్యూడలిజం పాలన జరుగుతోంది. స్త్రీ శక్తి, నారీ శక్తిని జనసేన గౌరవిస్తుంది. అందుకే స్వాతంత్ర్య దినోత్సవాలను వీర మహిళలతో జరుపుకుంటున్నాం. స్వాతంత్రోద్యమంలో స్త్రీల పాత్ర ఎవ్వరూ మరువలేం. రాజ్యాంగం రాయడానికి వేసిన కమిటీలో 15 మంది మహిళలు ఉన్నారు.

దుర్గాభాయ్ దేశ్ ముఖ్ ఆ కమిటీలో ఉండడం గర్వకారణం. స్వాతంత్ర్య సముపార్జనలో.. రాజ్యాంగ రూపకల్పనలో మహిళల పాత్ర ఉంది. వీరమహిళలు, ఆడపులుల ఆశీర్వాదంతోనే నేను పార్టీ నడపగలుగుతున్నాను. ఉద్యోగ, ఉపాధి కోసం.. రాజకాయాల కోసం బయటకొచ్చిన మహిళలు నెగ్గుకురావడం కష్టం. జనసేన మహిళలకు పెద్ద పీట వేస్తోంది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి త్యాగాలను గుర్తు తెచ్చుకోవడానికే స్వాతంత్ర్య దినోత్సవం. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములుకు సరైన గుర్తింపు లభించలేదు. పొట్టి శ్రీరాములు విగ్రహం ఆర్యవైశ్య సంఘాల్లో కన్పిస్తుంది తప్ప.. ఎక్కడా పెద్దగా కన్పించదు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన రాష్ట్రంలో చాలా మంది సీఎంలవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలు కన్పిస్తున్నాయే తప్ప.. పొట్టి శ్రీరాముల ఫొటో ఎక్కడ కన్పించడం లేదు. గతంలో ఎలాంటి ఘటనలు జరిగాయి..? ఎవరు ఎలాంటి త్యాగాలు చేశారో గుర్తుంచుకోవాలి. మణిపూర్ లాంటి ఘటనల్లో బాధితులు స్త్రీలే. తాడేపల్లిలో క్రైమ్ రేటు ఎక్కువగా ఉంది.

మహిళా మంత్రులు, మహిళా కమిషన్ మాట్లాడదు. నన్ను తిట్టడానికి మాత్రం వస్తారు. ఒక తల్లి బాధ తీర్చలేనప్పుడు 151 సీట్లు వచ్చి ఏం ప్రయోజనం..? 30 కేసులున్న వ్యక్తి సీఎం అయ్యారు. కోర్టులను కూడా ఈ వ్యక్తి తప్పు పడతాడు కులాల గురించి మాట్లాడుతూ కుల రాజధానులు అంటాడు. అబద్ధాలు చెప్పేవాడిని ముఖ్యమంత్రి గా ఎన్నుకోకూడదు. జనసేన ప్రజాకోర్టు కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. సామాజిక మాధ్యమాల ద్వారా.. ప్రత్యక్ష కార్యక్రమాల ద్వారా ప్రజా కోర్టు నిర్వహిస్తాం. ప్రజా కోర్టులో సీఎంనే ముందుగా నిలబెడతాం.

అవినీతి, అక్రమాలను బయటపెడితే నగదు ప్రొత్సహకాలు ప్రకటిస్తాం. సరైన వ్యక్తులను ఎన్నుకోకుంటే 2047 నాటికి మన బిడ్డల భవిష్యత్తును మనమే నాశనం చేసుకున్న వాళ్లం అవుతాం. కులం, మతం చూసి ఓటేయొద్దు.. మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోవాలి. స్టీల్ ప్లాంటును కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న పథకాలకంటే ఎక్కువే ఇస్తాం. వచ్చిన పన్ను రాబడిని సద్వినియోగం చేస్తాం. మహిళల్లో పారిశ్రామిక వేత్తలు తయారు కావాలి.’ అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

Show comments