విమాన ప్రయాణం అంటేనే ఎమర్జెన్సీ ఉన్నవారే బుక్ చేసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు.. పెళ్లిళ్లు.. సమావేశాలకు వెళ్తుంటారు. పైగా డిసెంబర్, జనవరి సీజన్ అంటేనే ఎక్కువ ప్రయాణాలుంటాయి. ఇలాంటి ఫీక్ టైమ్‌లో విమాన సర్వీసులు ఆగిపోతే ఏ ప్రయాణికుడు జీర్ణించుకోగలడు. కొట్టేయాలన్నంత కోపం వస్తుంది. కానీ ఏం చేస్తారు.. ఎవరో చేసిన తప్పుకు సిబ్బందిని ఏం చేయలేరు కదా? ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రతి ఒక్కరికి కళ్లు చెమరుస్తున్నాయి.
గత ఐదు రోజులుగా ప్రయాణాలు లేక విమానాశ్రయాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చాలా మంది ముఖ్యమైన ప్రయాణాలు ఆగిపోవడంతో మహిళా ప్రయాణికులు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. తమను పట్టించుకునే నాథుడే లేడంటూ తీవ్రమైన దు:ఖంతో ఆవేదన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం డీజీసీఏ విధించిన ఆంక్షలు వారం పాటు ఎత్తేసినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. ఏ ఎయిర్‌పోర్టులో చూసినా కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఉన్నాయి. ఇంకొందరైతే నీరసించి పోయి ఎక్కడికక్కడే నిద్రపోతున్నారు. ఇదేం దుస్థితి అంటూ మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ఎవరిని కదిలించిన కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పట్టించుకుని సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
