NTV Telugu Site icon

Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024.. చరిత్రకు అడుగు దూరంలో మను బాకర్!

Manu Bhaker

Manu Bhaker

Shooter Manu Bhaker on Cusp of history in Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మహిళా షూటర్‌ మను బాకర్ తొలి పతకం అందించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో మను కాంస్య పతకం గెలిచింది. భారత్‌కు పతకం అందించిన ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక మను బాకర్ నేడు మరో పోరుకు సిద్ధమైంది.10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ కాంస్య పోరులో సరబ్‌జ్యోత్‌తో కలిసి బరిలోకి దిగనుంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు దక్షిణ కొరియా ద్వయం లీ-యెజిన్‌తో భారత్ జోడీ తలపడనుంది.

నేడు జరిగే మిక్స్‌డ్‌ టీమ్‌ పోరులో గెలిచి కాంస్య పతకం దక్కించుకుంటే.. మను బాకర్‌ అరుదైన రికార్డు అందుకుంటుంది. స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా చరిత్రలో నిలుస్తుంది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900 ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ రెండు రజత పతకాలు గెలిచాడు. బ్రిటీష్‌-ఇండియన్ అథ్లెట్‌ అయిన ప్రిచర్డ్.. 1900 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతడి తర్వాత ఏ భారత అథ్లెట్ ఒక ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించలేదు.

Also Read: Paris Oympics 2024: చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్‌ మనికా బత్రా!

అయితే కెరీర్‌లో మాత్రం ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు సుశీల్ కుమార్ కాగా.. ఇంకొకరు తెలుగు తేజం పీవీ సింధు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజత పతకంను రెజ్లర్ సుశీల్ సాధించాడు. బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. ఇప్పుడు మను బాకర్ చరిత్రకు అడుగు దూరంలో ఉంది.