Site icon NTV Telugu

Parineeti Chopra Marriage: వివాహ బంధంతో ఒక్కటైన పరిణీతి, రాఘవ్

Parineeti Chopra Wedding

Parineeti Chopra Wedding

Parineeti Chopra Marriage: బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా వివాహబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఢిల్లీలో అర్దాస్‌ వేడుకతో వీరి పెళ్లి వేడుకలు ప్రారంభం కాగా.. ఈ నెల 22న వధూవరుల కుటుంబాలు ఉదయ్‌పూర్‌ చేరుకున్నాయి. అదే రోజున మెహందీ వేడుకతో పాటు సంగీత్‌ వేడుకను కూడా నిర్వహించారు.

Also Read: Ravi Kishan: డానిష్ అలీపై చర్య తీసుకోవాలి..స్పీకర్ని కోరిన రేసుగుర్రం విలన్..

సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో వీరి వివాహ రిసెప్షన్‌ జరగనుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది. ఢిల్లీలో రాజకీయ నాయకుల కోసం, ముంబైలో సినీ ప్రముఖల కోసం రిసెప్షన్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. వీరి పెళ్లికి పరిణీతి చోప్రా సోదరి, గ్లోబల్ స్టార్‌ ప్రియాంకా చోప్రా హాజరు కాలేదు. ఇప్పటికే అంగీకరించిన షూటింగ్స్ ఉండడంతో ప్రియాంక రాలేకపోయినట్లు తెలిసింది.

పరిణీతి చోప్రా, రాఘవ్‌ చద్దాల మధ్య లండన్‌లో పరిచయం ఏర్పడింది. లండన్‌ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా కలిసి చదువుకున్నారు. అనంతరం వారి మధ్య పరిచయం పెరిగి, అది కాస్తా ప్రేమగా మారింది. పరిణీతి చోప్రా హీరోయిన్‌గా రాణిస్తుండగా.. రాఘవ్‌ చద్దా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈ ఏడాది మార్చిలోనే వీరిద్దరి విషయం బయటకు వచ్చింది. వీరిద్దరు కలిసి పంజాబ్‌ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ను వీక్షించారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి ఈవెంట్స్‌కు హాజరవుతుండడంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. కాగా 2022లో 33 సంవత్సరాల వయస్సులో రాఘవ్ చద్దా పంజాబ్ రాష్ట్రం నుంచి అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడిగా రాజ్యసభకు ఎంపికయ్యారు. పరిణీతి చోప్రా 24 సంవత్సరాల వయస్సులో 2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది.

Exit mobile version