Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!

Panama Earthquake

Panama Earthquake

Panama Earthquake: మధ్య అమెరికా దేశమైన పనామాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం దక్షిణ పనామా ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపం ధాటికి రాజధాని పనామా సిటీలో భవనాలు కంపించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ఈ ప్రకంపనలు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నమోదయ్యాయి.

అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ (యూఎస్‌జీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం.. పనామా దక్షిణ ప్రాంతంలోని పిటాలోసా అరిబాకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పాటు విమాన సర్వీసులను సైతం నిలిపివేశారు.

భూకంపం అనంతరం వరుసగా డజనుకు పైగా ప్రకంపనలు (ఆఫ్టర్‌షాక్స్) సంభవించడంతో ప్రజల్లో భయం మరింత పెరిగింది. చాలా సేపటి వరకు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. పలు ప్రావిన్సుల్లో అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. భూకంపం ప్రభావంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని యూఎస్‌జీఎస్ హెచ్చరించినప్పటికీ.. నష్టం పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

భూకంపం ధాటికి ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైనే గడిపారు. సోషల్ మీడియాలో కనిపించిన వీడియోలలో వృద్ధులు భయంతో కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. ముఖ్యంగా హెరెరా ప్రావిన్స్‌లో భవనాలు దెబ్బతినడంతో అవి ఎక్కడ కూలిపోతాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భూకంపం కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు, నష్టంపై అంచనాలు కొనసాగుతున్నాయి. వరుస ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.