ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రాజుపాలెం, వినుకొండలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్లగా.. టీడీపీ కార్యకర్తలు, పోలీసుల అడ్డంకులతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాజుపాలెంలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను చించివేయడంతో పాటు పార్టీ నాయకుల కారును ధ్వంసం చేశారు.
పల్నాడు జిల్లా రాజుపాలెంలో నామినేషన్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ తరఫున నెమలిపురం-1 ఎంపీటీసీ అభ్యర్థి తులశమ్మ నామినేషన్ వేసేందుకు కార్యాలయానికి వచ్చారు. అయితే ఆమెను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను చించివేసి, కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ నాయకుల కారును కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నామినేషన్ ప్రక్రియకు ఆటంకాలు ఎదురవడంతో వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు పల్నాడు జిల్లా వినుకొండలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా హైటెన్షన్ నెలకొంది. నామినేషన్లు వేసేందుకు వచ్చిన వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఎదురెదురుగా ఉండటంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ నాయకులు, అభ్యర్థులను పోలీసులు, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎదురెదురుగా ఉండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

