Pakistan: పాకిస్తాన్‌కు చైనా తన నాలుగో తరం యుద్ధవిమానమైన J-10Cని ఇస్తోంది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, చైనా గత ఐదేళ్లలో 20 యుద్ధవిమానాలను సరఫరా చేసిందని, ఇప్పుడు మరో 16 J-10 ఫైటర్ జెట్‌లను ఇవ్వబోతున్నట్లు పెంటగాన్ తాజా నివేదిక వెల్లడించింది. ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని దేశాలతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో చైనా స్థావరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని పేర్కొంది. J-10C సింగిల్ సీటర్ ఫైటర్ జెట్ కాగా, J-10S డబుల్ సీటర్, దీనిని ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తారు.
“అంగోలా, బంగ్లాదేశ్, బర్మా, క్యూబా, ఈక్వటోరియల్ గినియా, ఇండోనేషియా, కెన్యా, మొజాంబిక్, నమీబియా, నైజీరియా, పాకిస్తాన్, పాపువా న్యూ గినియా, సీషెల్స్, సోలమన్ దీవులు, శ్రీలంక, తజికిస్తాన్, థాయిలాండ్, టాంజానియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వనువాటులలో కూడా స్థావరాన్ని ఏర్పరచుకోవాలని చైనా భావించింది” అని US కాంగ్రెస్‌కు సమర్పించిన పెంటగాన్ నివేదిక వెల్లడించింది. చైనీస్ ఆర్మీకి మలక్కా జలసంధి, హార్ముజ్ జలసంధి, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్‌లోని ఇతర ప్రాంతాల్లో సముద్ర మార్గాల వెంట సైనిక ఉనికిపై ఆసక్తి ఉందని చెప్పింది.
Read Also: Viral Video: మ్యాచ్లో తనకు బ్యాటింగ్ రాలేదన్న కోపంతో.. ఏకంగా ట్రాక్టర్ తీసుకొని దున్నేసాడు..!
డిసెంబర్ 2021లో పాక్, చైనా నుంచి 25 J-10C ఫైటర్ జెట్‌లతో పాటు, అదనంగా మరో 11 జెట్‌లను కొనుగోలు ఆప్షన్‌తో కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ ఫ్రాన్స్ నుంచి రాఫెల్ జెట్లను కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పందం చేసుకున్న 5 ఏళ్ల తర్వాత పాక్ చైనాతో ఈ ఒప్పందం చేసుకుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో, ఈ J-10C జెట్లు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాడినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. దాడి చేసే సామర్థ్యం క లిగిన కైహాంగ్, వింగ్ లూంగ్ యూఏవీలను, నాలుగు యుద్ధ నౌకల్ని కూడా చైనా పాక్‌కు సరఫరా చేసినట్లు నివేదిక వెల్లడించింది.
పాక్ నేవీ తన జలాంర్గామి నౌకదళాన్ని ఆధునీకరించడానికి సాంకేతిక బదిలీతో చైనా నుంచి 8 యువాన్ జలాంతర్గాముల్ని కొనుగోలు చేస్తోందని, వాటిలో 4 చైనా నుంచి రాగా, మిగిలినవి కరాచీలో నిర్మింతమవుతాయి. మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా చైనా తన అందరిక్ష సహకారాన్ని విస్తరణ పెంచిందని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి అమెరికా ఆధిపత్యాన్ని బలహీనపరుస్తూ, సహకార అంతరిక్ష శక్తిగా తన ఇమేజ్ పెంచుకుంటోందని నివేదిక పేర్కొంది. డిసెంబర్ 2024 నాటికి చైనా పాక్‌తో సహా 50కి పైగా దేశాలతో దాదాపుగా 200 అంతర్ ప్రభుత్వం అంతరిక్ష సహకార ఒప్పందాలపై సంతకం చేసింది.
