Jamaat-ul-Ahrar: దాయాది దేశంలో ఉగ్రవాదం పెరుగుతోంది. పాకిస్థాన్‌లో ఉగ్రదాడుల వార్తలు రోజూ వెలుగులోకి వస్తున్నాయి. గతంలో షాబాజ్ ప్రభుత్వాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఇబ్బంది పెట్టగా, ఇప్పుడు మరో ఉగ్రవాద సంస్థ పాక్ గుండెలపై ముల్లుగా మారింది. దాని పేరే జమాత్-ఉల్-అహ్రార్ ఉగ్రవాద సంస్థ. ఇది దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. సోమవారం పాకిస్థాన్‌లోని పెషావర్ పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారు. ఈ ఉగ్రవాదులు మొదట కాల్పులు జరిపి, ఆపై ఆత్మాహుతి బాంబర్లుగా మారారు. ఈ దాడిలో ముగ్గురు సైనికులు, దాడి చేసిన ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడికి జమాత్-ఉల్-అహ్రార్ ఉగ్రసంస్థ బాధ్యత వహించింది.
READ ALSO: Ram Charan: ట్రంప్ జూనియర్‌తో రామ్ చరణ్ ముచ్చట్లు!
జమాత్-ఉల్-అహ్రార్ అంటే ..
పాకిస్థాన్‌లో జరిగిన తాజా దాడికి పాకిస్థానీ తాలిబన్ నుంచి విడిపోయిన జమాత్-ఉల్-అహ్రార్ అనే ఉగ్ర సంస్థ బాధ్యత వహించింది. ఈ సంస్థ దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తూ ఉంది. ఈ ఉగ్ర సంస్థకు టీటీపీలో కూడా మూలాలు ఉన్నాయి. ఇది ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని లాల్‌పురా ప్రాంతం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం.
ఈ ఉగ్రసంస్థను ఆగస్టు, 2014లో TTP మాజీ నాయకుడు అబ్దుల్ వలీ స్థాపించారు. TTP మొహమ్మద్ ఏజెన్సీ వర్గం, అహ్రార్-ఉల్-హింద్ సంస్థ విలీనం అయినప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ ఏర్పడింది. ఉమర్ ముకర్రం ఖురాసాని ఈ గ్రూపు నాయకుడు. దీని కమాండర్లు, సభ్యులలో ఎక్కువ మంది పాకిస్థాన్ సమాఖ్య పరిపాలన గిరిజన ప్రాంతాలు (FATA)లోని మొహమ్మద్ ఏజెన్సీ నుంచి వచ్చారు. పాకిస్థాన్ ఆపరేషన్ జర్బ్-ఎ-అజ్బ్ (2014) తర్వాత ఈ గ్రూపును రద్దు చేశారు. అయితే ఈ సంస్థ మిగిలిన సభ్యులు పాకిస్థాన్ లోపల ఉగ్రవాద దాడులు చేస్తూనే ఉన్నారు.
స్థాపకుడిని ఖతం చేశారు..
ఈ ఉగ్రవాద సంస్థను స్థాపించింది ఒమర్ ఖలీద్ ఖురాసాని. ఇతని అసలు పేరు అబ్దుల్ వలీ మొహమ్మద్. ఇతను కరాచీలోని అనేక మదర్సాలలో చదువుకున్న మాజీ జర్నలిస్ట్, కవి. ఇతను గతంలో ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న మొహమ్మద్ ఏజెన్సీలో TTP (తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్) కు నాయకత్వం కూడా వహించాడు. ఒమర్, మొహమ్మద్ ఏజెన్సీకి చెందిన చాలా మంది టీటీపీ సభ్యులు 2014లో ఆ సంస్థ నుంచి విడిపోయి తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ జమాత్-ఎ-అహ్రార్ (టీటీపీ-జేఎ) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 7, 2022న ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన బాంబు పేలుడులో ఒమర్ ఖలీద్ ఖొరాసాని మరణించాడు. ఆఫ్ఘనిస్థాన్ తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని బర్మల్ జిల్లా సమీపంలో ఒమర్ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగింది. దాడిలో ఒమర్‌తో పాటు మరో ఇద్దరు కూడా మరణించారు.
ఇప్పటి వరకు ఈ ఉగ్రసంస్థ ఆధ్వర్యంలో జరిగిన బాంబు దాడులు..
* 2014 నవంబర్ 2న, భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని వాఘా కస్టమ్స్ పోస్ట్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 60 మంది మృతి చెందగా , 100 మంది గాయపడ్డారు.
* 2014 నవంబర్ 7న జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు మరణించారు.
*2015 మార్చి 15న లాహోర్‌లోని యూహానాబాద్ చర్చిపై జరిగిన దాడిలో 15 మంది మరణించారు .
*2015 మార్చి 27న ఈస్టర్ ఆదివారం నాడు లాహోర్‌లోని పిల్లల పార్కుపై జరిగిన దాడిలో 72 మంది మరణించగా , 320 మంది గాయపడ్డారు.
*మార్చి 1, 2016న, సంగర్ ప్రాంతంలో US డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) బృందం ప్రయాణిస్తున్న వాహనంపై IED దాడిలో పెషావర్ US కాన్సులేట్‌లోని ఇద్దరు ఉద్యోగులు మరణించారు.
*2016 మార్చి 15న, షబ్ఖాదర్ (చర్సద్దా) జిల్లా కోర్టుపై జరిగిన బాంబు దాడిలో 14 మంది మరణించగా , 52 మంది గాయపడ్డారు.
*2016 సెప్టెంబర్ 2న పెషావర్‌లోని వార్సాక్ కాలనీలో జరిగిన బాంబు దాడిలో ఐదుగురు మరణించారు.
*2017 ఫిబ్రవరి 13న లాహోర్‌లో జరిగిన దాడిలో 13 మంది మరణించగా , 50 మందికి పైగా గాయపడ్డారు.
*2017 ఫిబ్రవరి 13న లాహోర్ దాడితో సహా అనేక ఉగ్రవాద దాడులకు జేయుఏ బాధ్యత వహించింది.
READ ALSO: Ram Charan Chikiri : సెంచరీ కొట్టిన చికిరీ..మరో రికార్డు!