Pakistan-Taliban Tensions: పాకిస్థాన్, తాలిబాన్‌ల మధ్య విభేదాలు మళ్లీ తీవ్ర రూపాన్ని దాల్చాయి. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఒక భారీ తీవ్రవాద దాడి తర్వాత, ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌కు నేరుగా గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాద దాడులను నెపంగా చూపి పాకిస్థాన్ గనుక ఆఫ్ఘనిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి సైనిక చర్యలకు దిగితే, తమ దేశ సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సరిహద్దులను కాపాడుకోవడానికి ఎంతటి తీవ్రమైన నిర్ణయానికైనా వెనుకాడమని తాలిబాన్ స్పష్టం చేసింది. తమ భూభాగంపై ఎలాంటి దాడి జరిగినా దానికి తగిన రీతిలోనే గట్టి సమాధానం ఇస్తామని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తీవ్రంగా హెచ్చరించారు. మరోవైపు, పాకిస్థాన్‌లో జరుగుతున్న వరుస రక్తపాతాలకు ఆఫ్ఘన్ భూభాగం నుంచే కుట్రలు జరుగుతున్నాయని ఇస్లామాబాద్ సుదీర్ఘకాలంగా ఆరోపిస్తోంది. ఈ పరస్పర ప్రతిసవాల్‌లతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నాయి.
ఆల్ అరేబియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆర్టికల్ 51ని సాకుగా చూపి పాకిస్థాన్ గనుక ఆఫ్ఘనిస్థాన్ భూభాగంపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తే, తమను తాము ఆత్మరక్షణ చేసుకునే పూర్తి హక్కు తమకు ఉందన్నారు. తమ దేశ స్వతంత్రతను, సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తే అస్సలు సహించేది లేదని, ఏదైనా సైనిక చర్యకు దిగితే బలమైన ప్రతిదాడి ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. దీని అర్థం, తమ దేశంలో జరిగే ఏ పెద్ద తీవ్రవాద దాడి వెనుకైనా ఆఫ్ఘనిస్థాన్ హస్తం ఉందని భావించి పాకిస్థాన్ సరిహద్దులు దాటి దాడికి దిగితే, తాలిబాన్ దాన్ని నేరుగా ఆఫ్ఘనిస్థాన్‌పై జరిగిన యుద్దంగానే పరిగణిస్తుందని చెప్పారు. ఇక, ఈ హెచ్చరికల వెనుక ప్రధాన కారణం పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కోహాట్‌లో జరిగిన ఘోర తీవ్రవాద దాడే. శుక్రవారం నాడు ఉగ్రవాదులు అక్కడ ఉన్న ఓల్డ్ పోలీస్ లైన్స్ ప్రాంగణాన్ని లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. జిల్లా స్థాయి పోలీస్ ప్రధాన కార్యాలయంతో పాటు కౌంటర్ టెర్రరిజమ్ డిపార్ట్‌మెంట్, స్పెషల్ బ్రాంచ్ వంటి కీలక విభాగాల ఆఫీసులు ఉన్న ఈ ప్రాంగణంలో జరిగిన దాడిలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో 16 మంది పోలీసులు ఉన్నారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాడి ముగిసిన తర్వాత కూడా కొందరు ఉగ్రవాదులు ప్రాంగణంలోని స్పెషల్ బ్రాంచ్ విభాగంలో దాక్కుని ఉండటంతో భద్రతా బలగాలు వారితో సుదీర్ఘకాలం ఎదురుకాల్పులు కొనసాగించాల్సి వచ్చింది.
పాకిస్థాన్‌లో అశాంతిని సృష్టిస్తున్న తెహ్రీక్-యే-తాసిబాన్ పాకిస్థాన్ (TTP) సభ్యులు ఆఫ్ఘనిస్థాన్‌లో ఆశ్రయం పొందుతూ, అక్కడి నుంచే తమ దేశంలో దాడులకు పథకాలు వేస్తున్నారని పాకిస్థాన్ నిరంతరం ఆరోపిస్తోంది. ఆ ఉగ్రవాదులను అడ్డుకోవడంలో ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లేదా వారికి సహకరిస్తోందని ఇస్లామాబాద్ వాదిస్తోంది. అయితే, ఈ ఆరోపణలను తాలిబాన్ పూర్తిగా తోసిపుచ్చింది. పాకిస్థాన్ తన అంతర్గత భద్రతా సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని, TTP, బలూచ్ సంస్థల వల్ల ఉత్పన్నమవుతున్న అశాంతి తాలిబాన్లు అధికారంలోకి రాకముందు నుంచే ఉనికిలో ఉందని జబీహుల్లా ముజాహిద్ స్పష్టం చేశారు. ఈ విధంగా ఇరుదేశాలు పరస్పరం నిందలు వేసుకుంటూ హెచ్చరికలు జారీ చేసుకోవడంతో సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

