Pakistan Supreme Court Blast: పాకిస్థాన్ సుప్రీంకోర్టు భవనంలో పేలుడు సంభవించి 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ భారీ పేలుడు సుప్రీంకోర్టు బేస్మెంట్ క్యాంటీన్‌లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడం వల్ల సంభవించిందని ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. అయితే ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ మరమ్మతుల సమయంలో పేలుడు సంభవించిందని స్థానిక మీడియా పేర్కొంది. పాకిస్థాన్ టీవీ ఛానల్ సమా టీవీ కథనం ప్రకారం.. సుప్రీంకోర్టు భవనంలోని సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మరమ్మతు సమయంలో ఈ భారీ పేలుడు సంభవించిందని నిఘా వర్గాలు నిర్ధారించాయని తెలిపింది.
READ ALSO: Gopichand P Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా కన్నుమూత..
భయంతో బయటికి పరుగులు..
సుప్రీంకోర్టు భవనంలో ఆకస్మిక పేలుడు కారణంగా అంతా గందరగోళం నెలకొంది. ప్రకంపనలతో భవనం మొత్తం కంపించింది, న్యాయవాదులు, న్యాయమూర్తుల సిబ్బంది, ఇతర ఉద్యోగులు భయంతో బయటికి పరుగులు తీశారు. పాకిస్థాన్ మీడియా నివేదికల ప్రకారం.. పేలుడు కారణంగా కోర్టు నంబర్ 6 కు తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం. పేలుడు జరగడానికి ముందు జస్టిస్ అలీ బాకర్ నజాఫీ, జస్టిస్ షాజాద్ మాలిక్ అక్కడ విచారణలు నిర్వహించారు.
సిబ్బందికి తీవ్ర గాయాలు..
భారీ పేలుడు కారణంగా గాయపడిన కార్మికుల్లో ఎక్కువ మంది ఏసీ ప్లాంట్ సమీపంలో మరమ్మతులు చేస్తున్న వారు ఉన్నారని, వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. బేస్‌మెంట్‌లో ఉన్న ఈ కెఫెటేరియా సుప్రీంకోర్టు ఉద్యోగులకు మాత్రమే కేటాయించినట్లు వెల్లడించారు.
ఇస్లామాబాద్ ఐజీపీ అలీ నాసిర్ రిజ్వీ మాట్లాడుతూ.. క్యాంటీన్‌లో చాలా రోజులుగా గ్యాస్ లీక్ అవుతోందని అన్నారు. ఎయిర్ కండిషనర్ మరమ్మతుల సమయంలో ఈ పేలుడు సంభవించిందని ఆయన చెప్పారు. “పలువురు నిపుణులు కూడా ఇది గ్యాస్ పేలుడు అని నిర్ధారించారు” అని వెల్లడించారు. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒక ఏసీ టెక్నీషియన్ శరీరం దాదాపు 80% వరకు కాలిపోయిందని చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
READ ALSO: Trump Mexico Operation: 100 ఏళ్ల తర్వాత మెక్సికోకి ట్రంప్ సైన్యం.. ఇక రక్తపాతమేనా!
