Site icon NTV Telugu

Pakistan: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి, 30 మందికి గాయాలు!

Pakistan Suicide Bombing

Pakistan Suicide Bombing

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 14 మంది మరణించగా.. దాదాపుగా 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు చికిత్స నిమ్మితం సమీప ఆస్పత్రికి తరలించారు. బలోచిస్థాన్‌ నేషనల్‌ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రావిన్షియల్ ముఖ్యమంత్రి సర్దార్ అతావుల్లా మెంగల్ వర్ధంతిని పురస్కరించుకుని బలోచ్‌ రాజధాని క్వెట్టాలో బీఎన్‌పీ రాజకీయ సమావేశం నిర్వహించగా.. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారి హంజా షఫాత్ ఓ ప్రకటనలో తెలిపారు.

క్వెట్టాలోని షావానీ స్టేడియంలో జరిగిన బీఎన్‌పీ సమావేశంకు వందలాది మంది బలోచ్‌ మద్దతు దారులు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా..స్టేడియం పార్కింగ్ స్థలంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఘటనా స్థలంలోనే పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాంబు దాడి జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలు స్టేడియం ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు చేపట్టాయి.

సర్దార్ అతావుల్లా మెంగల్ కుమారుడు సర్దార్ అక్తర్ మెంగల్ సురక్షితంగా ఉన్నాడని ప్రభుత్వ అధికారి హంజా షఫాత్ తెలిపారు. ఘటనలో 30 మంది గాయపడ్డారని తెలిపారు. జనాలు ర్యాలీ అనంతరం బయటకు వెళ్తుండగా.. పార్కింగ్ ప్రాంతంలో బాంబు పేలిందని చెప్పారు. ఈ దాడికి సంబంధించి ఏ ఉగ్ర సంస్థ ఇంతవరకు ప్రకటన చేయలేదు.

Exit mobile version