Pakistan: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభాన్ని సృష్టించింది. శనివారం ఉదయం ఇరాన్ వ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయిల్ సమన్వయ దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఆయన ఆఫీస్, నివాసంపై భారీ దాడులు జరిగాయి. అయితే, ఈ దాడులకు ముందే ఖమేనీ సురక్షిత ప్రాంతానికి వెళ్లారని కొన్ని నివేదికలు చెప్పాయి. ఈ దాడులకు ప్రతీకారంగా సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, జోర్డాన్, కువైట్, బహ్రైయిన్, ఖతార్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఇక గల్ఫ్‌లోనే పెద్ద నగరాలైన దుబాయ్, రియాద్, అబుదాబీ, ఖతార్ సిటీలపై దాడులు చేసింది.
ముఖ్యంగా, సౌదీ అరేబియా ఈ దాడిని ‘‘పిరికపంద చర్య’’గా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో సౌదీకి మద్దతుగా పాకిస్తాన్ ఇరాన్‌పై దాడి చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్ఘాన్‌తో ఇప్పటికే ఒక యుద్ధంలో ఉన్న పాక్ ఇరాన్‌పై దాడి చేసే ధైర్యం చేస్తుందా? అనేది సందేహాస్పదమే. గతేడాది సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ఒక దేశం మరేదైనా దాడి చేస్తే అది ఇరు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని పాకిస్తాన్ చెప్పింది. ఇప్పుడు సౌదీపై ఇరాన్ దాడి చేసింది, ఇది తమపై దాడిగా పరిగణించి పాకిస్తాన్ దాడి చేస్తుందా? అనేది అనుమానమే.
కానీ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్‌లో సౌదీ అరేబియాకు మద్దతుగా ఒక పోస్ట్ షేర్ చేశారు. “ఈ సాయంత్రం, నా ప్రియమైన సోదరుడు, హిజ్ రాయల్ హైనెస్ ది క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తో మాట్లాడాను, ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి మరియు గల్ఫ్ ప్రాంతంలో జరిగిన దాడుల తరువాత జరిగిన ప్రమాదకరమైన ప్రాంతీయ ఉద్రిక్తతను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది.” అని పాక్ ప్రధాని ట్వీట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో సౌదీకి పాకిస్తాన్ పూర్తి సంఘీభావం తెలియజేస్తుందని అన్నారు.
