T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..

Pak Womens

Pak Womens

మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేసింది. టోర్నీలో ఆడిన మొదటి మూడు మ్యాచ్‌ల్లోనే (భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ల చేతిలో) ఓటమి పాలై గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో, జట్టు సభ్యులతో పాటు ముఖ్య కోచ్ వహాబ్ రియాజ్‌పై పాక్ క్రికెట్ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో 65 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్, ఆ తర్వాత సౌతాఫ్రికాతో గట్టి పోటీ ఇచ్చి 2 వికెట్ల తేడాతో ఓడింది. అయితే, బంగ్లాదేశ్‌తో జరిగిన లో-స్కోరింగ్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మైదానంలో ప్రదర్శన ఇలా ఉంటే.. మైదానం వెలుపల ఆటగాళ్ల ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. టోర్నమెంట్ సమయంలో క్రీడాకారిణులు బయట విహరిస్తూ, రెస్టారెంట్లలో డిన్నర్లు చేస్తున్న వీడియోలు వైరల్ కావడమే ఇందుకు కారణం. టోర్నీ నుంచి వైదొలిగారుగా.. వెళ్లి షాపింగ్స్, డిన్నర్లు చేసుకోండి అంటూ పాకిస్థాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్ ప్లేయర్ నిదా దార్‌తో పాటు సహచరులు, అలాగే ఆలియా రియాజ్ ఆమె భర్త అలీ యూనిస్ (మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ తమ్ముడు) లతో కలిసి ఉన్న దృశ్యాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై పాక్ పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. “ఐసీసీ టోర్నీల్లో మహిళల జట్టు ప్రదర్శన ఏమాత్రం మెరుగుపడకపోవడం ఆశ్చర్యకరం” అని అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ కోచ్ కబీర్ ఖాన్ స్పందిస్తూ.. “ఆటగాళ్లకు అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ లేదా వసతుల కొరత లేదు. కానీ, వారు మానసికంగా ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు” అని విమర్శించారు.

×
×
Ad

మరోవైపు.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆలియా రియాజ్ మైదానంలో పడుకుని ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై కొందరు అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. జట్టు ఓడిపోయినప్పుడు సాంకేతిక లోపాలను విమర్శించడం సహజమే కానీ, క్రీడాకారిణుల వ్యక్తిగత విషయాలను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిరంతర ఓటములు ఇలాగే కొనసాగితే పాకిస్తాన్‌లో మహిళల క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని మాజీలు హెచ్చరిస్తున్నారు.