Pakistan Minister: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశంలో పాల్గొనేందుకు పాకిస్తాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్కు వచ్చారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ఓ పాకిస్తాన్ మంత్రి భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. భారత పర్యటనలో భాగంగా పాక్ మంత్రి తాజ్ మహల్, ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాను సందర్శించాని కోరినట్లు సమాచారం. అయితే, ఎస్సీఓ కార్యక్రమం మినహా ఇతర ప్రాంతాలు సందర్శించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీలోని చారిత్రక పురానా ఖిలా వేదికగా నవంబర్ 20 నుంచి 22 వరకు తొలిసారిగా ఎస్సీఓ సివిలైజేషనల్ డైలాట్ ఫోరం( నాగరికతల సంభాషన వేదిక) సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావడానికే ముసాదిక్ మాలిక్ భారత్ వచ్చారు. ఈ పర్యటనలో ఆగ్రాలోని తాజ్ మహల్, ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాను సందర్శించేందుకు మాలిక్ అనుమతి కోరినట్లు సమాచారం. అయితే, తాజ్ మహల్ సందర్శనకు భద్రతా పరమైన అనుమతులు వస్తే, సందర్శించే అవకాశం ఉండొచ్చని, దర్గాను మాత్రం సందర్శించేందుకు అనుమతి లభించలేదని తెలిసింది.
2023లో గోవాలో జరిగిన ఎస్సీఓ సమావేశానికి అప్పటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరైన తర్వాత.. భారత్కు వచ్చిన తొలి పాకిస్థాన్ కేంద్ర మంత్రిగా ముసాదిక్ మాలిక్ నిలిచారు. అలాగే, 2025 మేలో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్కు వచ్చిన తొలి పాకిస్థాన్ నేత కూడా ఆయనే. 2001లో షాంఘైలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల అధ్యక్షులు ఎస్సీఓను స్థాపించారు. భారత్, పాకిస్థాన్ 2017లో శాశ్వత సభ్య దేశాలుగా చేరాయి. 2023లో ఇరాన్ సభ్యత్వం పొందింది.

