Site icon NTV Telugu

Pakistan: “ఇమ్రాన్ ఖాన్‌కి ఏమైంది..?” పాకిస్థాన్ పార్లమెంట్‌లో గందరగోళం..

Imran Khan

Imran Khan

Pakistan: జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి.? ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారు? అనే ప్రశ్నలకు సరైన సమాధానం లేదు. ప్రస్తుతం మాజీ ప్రధాని స్థితి, పరిస్థితిని తెలుసుకునేందుకు పాకిస్థాన్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వం మాత్రం ఆయన క్షేమంగానే ఉన్నారని చెప్పినా నమ్మసక్యంగా అనిపించడం లేదు. షాబాజ్ ప్రభుత్వం, వల్పిండిలోని అడియాలా జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని పదే పదే చెబుతున్నప్పటికీ కుటుంబీకులు, పార్టీ అంగీకరించడం లేదు. ఇంతలో ఇమ్రాన్ ఖాన్ అంశంపై నిన్న పాకిస్థాన్ పార్లమెంట్‌లో రచ్చ చోటు చేసుకుంది.

READ MORE: Off The Record: కవితకు బీఆర్ఎస్ కౌంటర్స్.. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..?

పాకిస్థాన్ పార్లమెంటు దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) సభ్యుడు ఫైసల్ జావేద్ మాట్లాడుతూ.. రాబోయే 24 గంటల్లో ఇమ్రాన్ తన కుటుంబాన్ని కలవడానికి అనుమతించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇమ్రాన్‌ను ఎందుకు పూర్తిగా ఏకాంత నిర్బంధంలో ఉంచారు? అని ప్రశ్నించారు. ఇమ్రాన్ కుటుంబాన్ని కలవడానికి అనుమతి లేకపోవడంపై పీటీఐ ఎంపీ ఫైసల్ జావేద్ పార్లమెంటులో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. పాక్ అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి తలాల్ చౌదరి ఈ అంశంపై స్పందించారు. జైలు నిబంధనలను ఉదహరించారు. ఇమ్రాన్ ఖాన్ వీఐపీ ఖైదీ అని, జైలు మాన్యువల్ ప్రకారం మాత్రమే ఆయనను కలవడానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో పాక్ పార్లమెంట్‌లో గందరగోళం తలెత్తింది. పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది.

READ MORE: WPL 2026 Mega Auction: WPL వేలంలో అమ్ముడైన, అమ్ముడుకాని ప్లేయర్ల పూర్తి జాబితా ఇదిగో..!

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. గత కొన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఇమ్రాన్ ముగ్గురు సోదరీమణులు ఇమ్రాన్‌ను మూడు వారాల పాటు కలవడానికి అనుమతి లేదని ఆరోపిస్తున్నారు. న్యాయవాది సైతం గత కొన్ని వారాలుగా కలవలేదు. ఆయనకు సైతం అనుమతి కల్పించలేదు. దీంతో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఇమ్రాన్ ఖాన్‌పై విషప్రయోగం చేశారని లేదా అడియాలా జైలు నుంచి తరలించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జైలులోనే ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యానికి గురయ్యారని పుకార్లు ఉన్నాయి. కానీ ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా క్షేమంగా ఉన్నారని జైలు యంత్రాంగం స్పష్టం చేసింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, జైలులోని సౌకర్యాలను ఆస్వాదిస్తున్నారని చెప్పింది.

Exit mobile version