Pakistan: ప్రపంచవ్యాప్తంగా యువత ఇప్పుడు.. తమ గళాన్ని విప్పుతున్నారు.. ప్రభుత్వ విధానాలు నచ్చక.. సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక.. తిరుగుబాటు చేస్తున్నారు.. ఇప్పటికే పలు దేశాల్లో ఇలాంటి ఆందోళనలు, నిరసనలు చూడగా.. పాకిస్తాన్ కు ఇరుగుపొరుగున ఉన్న దేశాల్లోనూ ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది.. దీంతో, ఇప్పుడు పాకిస్తాన్కు కూడా భయం పట్టుకుంది.. పాకిస్తాన్లో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, అవినీతి, పాలనా వైఫల్యాలపై ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మోసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయన, దేశంలోని ప్రస్తుత వ్యవస్థపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, యువతలో పెరుగుతున్న అసహనాన్ని ప్రభుత్వం తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. యువతను ఉద్దేశించి ఆయన చేసిన “బొద్దింకలు ఏకమైతే అన్నింటినీ తలకిందులు చేయగలవు” అనే వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు కారణమయ్యాయి.
ఈ సందర్భంగా మోసిన్ నఖ్వీ మాట్లాడుతూ, “మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన వ్యవస్థ అవినీతిమయం. ప్రజలు, ముఖ్యంగా యువత, ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిని యువత అనండి, బొద్దింకలు అనండి లేదా ఇంకేదైనా అనండి.. కానీ వారు ఏకమైతే దేశంలో భారీ మార్పులు తీసుకురాగలరు” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా యువతలో పెరుగుతున్న అసంతృప్తి ప్రభుత్వానికి ప్రమాదకరంగా మారే అవకాశముందని ఆయన సంకేతాలిచ్చారు. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ద్రవ్యోల్బణం, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, విదేశీ అప్పులు, నిరుద్యోగం, హింసాత్మక ఘటనలు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యవస్థ ప్రజల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైందని నఖ్వీ బహిరంగంగానే అంగీకరించారు. యువతకు కావాల్సింది ఉచిత ల్యాప్టాప్లు లేదా తాత్కాలిక ఆర్థిక సాయం కాదని, ప్రతిభకు తగిన ఉద్యోగాలు, సమాన అవకాశాలు, పారదర్శక నియామకాలు, న్యాయమైన వ్యవస్థ కావాలని ఆయన స్పష్టం చేశారు.
“ఈ ‘బొద్దింకలు’ ఏకమైతే పరిస్థితిని పూర్తిగా మార్చేయగలరు. వారు కోరుకునేది చాలా సాధారణమైన విషయాలే. ప్రతిభకు గుర్తింపు, ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన ప్రాప్యత, న్యాయం కోరుతున్నారు. కానీ మనం ఇప్పటివరకు వారికి ఇవి అందించలేకపోయాం” అని నఖ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. యువతలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రభుత్వం ముందుగానే గుర్తించి వారి అంచనాలను నెరవేర్చాలని ఆయన సూచించారు. “వారు ఆందోళనలకు దిగకముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వారి డిమాండ్లు చాలా సరళమైనవి. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలి. మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇదే ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన బాధ్యత” అని పేర్కొన్నారు.
అంతేకాకుండా, దేశంలోని 70 ఏళ్ల పాలనా వ్యవస్థపై కూడా నఖ్వీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత పరిపాలనా నిర్మాణం పూర్తిగా విఫలమైందని, వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. శాశ్వత అభివృద్ధి కోసం కేవలం ప్రభుత్వ అధినేతలు ఎక్కువసేపు పనిచేయడం సరిపోదని, మొత్తం పరిపాలనా వ్యవస్థను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరిపాలనా సంస్కరణలపై కూడా నఖ్వీ కీలక ప్రతిపాదనలు చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, న్యాయం మరింత చేరువ కావాలంటే కొత్త పరిపాలనా విభాగాలు, కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. భారతదేశాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో 14 రాష్ట్రాలు ఉండగా ప్రస్తుతం 29 రాష్ట్రాలుగా అభివృద్ధి చెందిందని చెప్పారు. పరిపాలనను ప్రజలకు మరింత దగ్గర చేయడం వల్ల పాలనలో సమర్థత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయ పార్టీలు పరస్పర విభేదాలను పక్కనపెట్టి దేశ ప్రయోజనాల కోసం సంస్కరణలపై ఏకాభిప్రాయానికి రావాలని నఖ్వీ పిలుపునిచ్చారు. అలాగే వ్యాపార వర్గాలు కేవలం ఎన్నికలకు నిధులు సమకూర్చడానికే పరిమితం కాకుండా, దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. యువత ఆశయాలను అర్థం చేసుకుని వారికి ప్రతిభ ఆధారిత అవకాశాలు కల్పిస్తేనే దేశ భవిష్యత్తు బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. మొత్తంగా, పాకిస్తాన్ హోం మంత్రి మోసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ, పరిపాలనా సంక్షోభాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాయి. యువత అసంతృప్తిని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశముందని ఆయన హెచ్చరిస్తూ, వ్యవస్థాగత సంస్కరణల ద్వారానే పాకిస్తాన్ భవిష్యత్తును మెరుగుపరచవచ్చని స్పష్టం చేశారు.

