NTV Telugu Site icon

Pakistan Elections 2024: పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్‌కు అత్యధిక సీట్లు.. సంకీర్ణానికి నవాజ్‌ పిలుపు!

Imran Khan, Nawaz Sharif

Imran Khan, Nawaz Sharif

Pakistan Election 2024 Results: 2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. స్పష్టమైన మెజారిటీ లేనప్పటికీ.. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీకి అత్యధికంగా 97 సీట్లు వచ్చాయి. పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మరో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్)కి 71 సీట్లు దక్కాయి. బిలావల్‌ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టికి 53 రాగా.. మిగతా పార్టిలు 27 సీట్లు గెలుచుకున్నాయి.

పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో మొత్తంగా 336 సీట్లు ఉండగా.. 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. ఇక ఓ స్థానంలో అభ్యర్థి మరణించడంతో 265 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. పాకిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పరచాలంటే మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ మార్కు) 133 సీట్లు కావాలి. ఏ పార్టీకి మెజారిటీ మార్కు రాకపోవడంతో.. పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో హంగ్‌ నెలకొంది.

Also Read: Road Accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

నవాజ్‌ షరీఫ్‌ సంకీర్ణ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. నాలుగోసారి ప్రధాని పదవిని అధిష్ఠించాలనుకుంటున్న షరీఫ్‌.. బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పీపీపీతో కూటమి కట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ముందుకు రావాలంటూ వివిధ రాజకీయ పక్షాలకు షరీఫ్‌ పిలుపునిచ్చారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ విజయం తమదే అని ప్రకటించారు. ఏ పాకిస్తానీ నవాజ్‌ షరీఫ్‌ను లేదా అతని విజయాన్ని అంగీకరించడు అని ఎక్స్‌లో పేర్కొన్నారు. తాము సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఇమ్రాన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాకిస్థాన్‌లో ఎవరు ప్రధాని అవుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తోషాఖానా సహా వివిధ కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కేసుల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. సాంకేతిక కారణాలతో పీటీఐ గుర్తు అయిన బ్యాట్‌ కూడా రద్దైంది. దీంతో పీటీఐ అభ్యర్థులు వివిధ గుర్తులతో స్వతంత్రంగానే పోటీ చేశారు. అయినా భారీ మెజారిటీ సంపాదించడం విశేషం. ఇక రెండు స్థానాల నుంచి పోటీ చేసిన నవాజ్‌ షరీఫ్‌.. లాహోర్‌లో గెలిచి, మన్సెహరాలో ఓడిపోయారు.