NTV Telugu Site icon

Babar Azam: అంపైర్ అవుట్ ఇచ్చి ఉంటే.. మేం రేసులో ఉండేవాళ్లం: బాబర్

Babar Azam Head

Babar Azam Head

Pakistan Captain Babar Azam react on Defeat vs South Africa: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శుక్రవారం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ ఒక వికెట్‌ తేడాతో ఓడిపోయింది. 271 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 47.2 ఓవర్లలో ఛేదించింది. ఐడెన్ మార్‌క్రమ్‌ (91; 93 బంతుల్లో 7×4, 3×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. సాద్‌ షకీల్‌ (52; 52 బంతుల్లో 7×4), బాబర్‌ అజామ్‌ (50; 65 బంతుల్లో 4×4, 1×6) హాఫ్ సెంచరీలు చేశారు. అయితే గెలిచే మ్యాచ్‌లో పాక్ ఓడిపోయింది. ‘అంపైర్స్ కాల్’ పాక్ జట్టును ముంచింది.

దక్షిణాఫ్రికా ఆఖరి బ్యాటర్‌ తబ్రైజ్ షంసీ.. పాక్ పేసర్ హరీష్ రవూఫ్‌ బంతికి వికెట్ల ముందుకు దొరికిపోయాడు. కానీ అంపైర్‌ ఔటివ్వలేదు. రిప్లేలో బంతి స్టంప్‌కు కొంచెమే తాకేదని తేలడంతో నిర్ణయం ‘అంపైర్‌ కాల్‌’గా వచ్చింది. దాంతో సఫారీ జట్టు బతికిపోయింది. ఈ విషయంపైనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ స్పందించాడు. ఒకవేళ అంపైర్ అవుట్ ఇచ్చి ఉంటే.. తాము ప్రపంచకప్ 2023 రేసులో ఉండేవాళ్లం అని పేర్కొన్నాడు. అయితే ఇదంతా ఆటలో భాగమని చెప్పాడు. మ్యాచ్ అనంతరం బాబర్ మాట్లాడుతూ కాస్త నిరాశకు గురయ్యాడు.

Also Read: IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన హార్దిక్ గాయం.. జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం!

‘మేము విజయానికి చాలా దగ్గరగా వచ్చాం. కానీ మ్యాచ్ ముగించలేకపోయాం. టీమ్ మొత్తానికి ఇది చాలా నిరాశ కలిగించింది. అయితే ఒకటి మాత్రం చెప్పగలను.. మేము బాగా పోరాడాము. బ్యాటింగ్‌లో మేము 10-15 తక్కువఆ చేశాం. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు బాగా పోరాడారు కానీ దురదృష్టవశాత్తు విజయం దక్కలేదు. డీఆర్‌ఎస్ మాకు వ్యతిరేకంగా వచ్చింది. ఇవన్నీ ఆటలో భాగం. అయితే డీఆర్‌ఎస్ మాకు అనుకూలంగా వస్తే.. ఇందులో గెలిచి రేసులో ఉండేందుకు మాకు అవకాశం ఉండేది. పాకిస్తాన్ కోసం చివరి మూడు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేస్తాం. తర్వాత పాయింట్స్ టేబుల్‌లో ఎక్కడ ఉంటామో చూడాలి’ అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.