NTV Telugu Site icon

Pakistan Boxer: విదేశాల్లో తోటి క్రీడాకారిణి డబ్బు దొంగిలించి.. పరారైన పాకిస్తాన్ బాక్సర్‌!

Pakistan Boxer Zohaib Rasheed

Pakistan Boxer Zohaib Rasheed

Pakistan Boxer steals money from teammate bag in Italy: విదేశాలకు వెళ్లిన ఓ పాకిస్థాన్‌ బాక్సర్‌ ఎవరూ ఊహించని పని చేశాడు. సహచర క్రీడాకారిణి బ్యాగ్ నుండి డబ్బు దొంగిలించి.. అక్కడినుంచి పరార్ అయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ఇటలీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లామని, ఈ ఘటనపై పోలీసు నివేదికను కూడా దాఖలు చేశామని ఫెడరేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన పాకిస్తాన్ క్రీడావిభాగంలో చర్చనీయాంశం అయింది.

ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్ ఐదుగురు సభ్యుల జట్టుతో ఇటలీకి వెళ్లింది. ఈ జట్టులో జోహెబ్‌ రషీద్‌ ఓ సభ్యుడు. పాక్ జట్టు సభ్యురాలైన లౌరా ఇక్రామ్‌ శిక్షణ శిబిరానికి వెళ్లగా.. కోచ్‌ అర్షాద్‌ హుస్సేన్‌ టోర్నీ ప్రారంభోత్సవానికి వెళ్లారు. వాతావరణం చల్లగా ఉందని చెప్పి.. రషీద్‌ శిక్షణకు డుమ్మా కొట్టి గదిలో ఉన్నాడు. సహచరులు వెళ్లిపోయాక ఫ్రంట్‌ డెస్క్‌ నుంచి తాళాలు తీసుకొని.. ఇక్రామ్‌ గదికి రషీద్‌ చేరుకొన్నాడు. ఇక్రామ్‌ పర్స్‌లోని విదేశీ కరెన్సీని తీసుకొన్న రషీద్‌.. హోటల్‌ నుంచి అదృశ్యమయ్యాడు. అతడు పాస్‌పోర్టు కూడా తీసుకెళ్లాడు. రషీద్‌ వీసాకు నెల రోజుల గడువు ఉంది.

Also Read: IND vs ENG: అశ్వినా లేదా బెయిర్‌స్టోనా.. కెరీర్ వందో టెస్టులో మెరిసేదెవరో?

ఈ ఘటనపై పాకిస్తాన్ బాక్సింగ్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ కర్నల్‌ నజీర్‌ అహ్మద్‌ స్పందించారు. ‘తోటి క్రీడాకారిణి డబ్బును జోహెబ్‌ రషీద్‌ దొంగిలించాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇటలీలోని పాక్‌ దౌత్య కార్యాలయానికి సమాచారం ఇచ్చాం. రషీద్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరితోనూ అతడు కాంటాక్ట్‌లోకి రాలేదు. రషీద్‌ దేశానికి తలవంపులు తీసుకొచ్చాడు’ అని నజీర్‌ అహ్మద్‌ అన్నాడు. రషీద్‌ గతేడాది జరిగిన ఆసియాన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు. పాక్‌లో ఎదుగుతున్న బాక్సర్లలో అతడు ఒకడు. ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో ఆదివారం శరణార్థుల బృందానికి చెందిన ఒమిద్‌ అహ్మదీసఫాతో అతడు తలపడాల్సి ఉంది. రషీద్‌ అదృశ్యం అవ్వడంతో పాకిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.