Pakistan: పాకిస్థాన్ భారీ పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లా.. దష్ట్ ప్రాంతంలోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు కారణంగా రైలులోని బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదం భయాందోళనలు సృష్టించింది. ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. రైలు ఆ దష్ట్ ప్రాంతానికి చేరుకోగానే పేలుడు సంభవించింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఒక కోచ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. బోగీలు పట్టాలు తప్పినట్లు ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కోచ్ లోపల మహిళలు, పిల్లలు చిక్కుకున్నారు. స్థానికులు, రెస్క్యూ బృందాలు వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.
READ MORE: Chattisgarh : నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టు కట్ట రామచంద్ర రెడ్డి హతం
కొన్ని గంటల క్రితం, అదే ప్రాంతంలో రైల్వే ట్రాక్‌లను క్లియర్ చేస్తున్న పాకిస్థాన్ దళాలను లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిగింది. ఒకే రోజులో అదే ప్రాంతంలో జరిగిన రెండవ సంఘటన ఇది. మొదట, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకున్నారు. రెండో ఘటనలో ఒక ప్యాసింజర్ రైలును లక్ష్యంగా చేసుకున్నారు. ఈ పేలుడులో ఒక బోగీ బోల్తా కొట్టగా.. మిగతా బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రతా దళాలు, పోలీసు బృందాలు పేలుడు జరిగిన ప్రదేశానికి వెంటనే చేరుకున్నాయి. సహాయ, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. చిక్కుకున్న ప్రయాణీకులను సురక్షితంగా తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, గాయపడిన వారి సంఖ్య లేదా పేలుడు వల్ల జరిగిన నష్టం ఎంతవరకు ఉందనే దానిపై సమాచారం లేదు.