NTV Telugu Site icon

United Nations: ఉక్రెయిన్‌ vs రష్యా.. ఇప్పటివరకు 8వేల మంది పౌరులు బలి

Ukraine Crisis

Ukraine Crisis

United Nations on Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి దాదాపు ఏడాది పూర్తి కావస్తోంది. ఇప్పటికీ అసంపూర్ణంగా కొనసాగుతున్న ఈ యుద్ధంతో ఇరు దేశాలు సాధించింది ఏమీ లేదు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడిని మొదలు పెట్టింది. అమెరికా అధ్వర్యంలోని నాటో దేశాలు ఉక్రెయిన్ భూభాగాన్ని తమ దేశానికి వ్యతిరేక కేంద్రంగా మలుచుకోకుండా చేయడమే తన ధ్యేయమని పుతిన్ నాడు ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యాన్ని నిర్వీర్యం చేయడమే తమ ఆపరేషన్ లక్ష్యమని తెలిపారు. కానీ, రష్యా అధ్యక్షుడి లక్ష్యాలు నెరవేరలేదు. సరికదా, అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఆయుధ, మందుగుండు, సైనిక సహకారాన్ని అందిస్తూనే ఉన్నాయి. దీంతో చాలా త్వరగా ఉక్రెయిన్‌ను నిర్వీర్యం చేయవచ్చని భావించిన రష్యాకు నిరాశే ఎదురైంది.

పాశ్చాత్య దేశాలు అందించే అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ఉక్రెయిన్ రష్యాకు ఎదురు నిలిచి పోరాడుతోంది. దీంతో ఉక్రెయిన్ తో యుద్ధం రష్యాకు సవాలుగా మారిపోయింది. ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. సైనిక చర్యల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. యూరప్ దేశాలకు చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. సహజ వాయువు వ్యాపారం కూడా దెబ్బతింది. యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల కమిషన్ గణాంకాల ప్రకారం ఉక్రెయిన్ లో ఫిబ్రవరి 13 నాటికి 7,199 మంది మరణించారు. 11,800 మంది గాయపడ్డారు. తాజాగా దాదాపు ఏడాది క్రితం రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి 8,000 మందికి పైగా పౌరులు మరణించారని యూఎన్‌ మానవ హక్కుల కార్యాలయం ఇవాళ తెలిపింది. మృతులసంఖ్య గణనీయంగా పెరిగిందని యూఎన్‌ నివేదిక తెలిపింది. 90 శాతం మంది బాధితులు బాంబులతో చంపబడినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్‌లో మృతుల సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం 8వేలు ఉండగా.. ఇంకా ఎక్కువగానే మరణాల సంఖ్య ఉండొచ్చని పేర్కొంది.

Read Also: Triple Talaq: విడాకులు ముస్లింలలోనే ఎందుకు నేరం.. కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆ రెండు దేశాలకే పరిమితం కాలేదు. ద్రవ్యోల్బణంతో ప్రపంచ దేశాలు సతమతం అవుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా అంతర్జాతీయంగా ఎన్నో దేశాలకు ఎగుమతులు చేస్తున్నాయి. యుద్ధం కారణంగా ఇవి నిలిచిపోయాయి. దీంతో వీటి ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆహారం, చమురుపై యుద్ధం ప్రభావం చూపిస్తోంది.