Manipur: ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో రిజర్వేషన్లు చిచ్చుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ ప్రజలకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. అల్లర్లతో రాష్ట్రం అట్టుడికింది. హింసలో గ్రామాలకు గ్రామాలు తగలబడిపోయాయి. ఈ హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో మణిపూర్ నుంచి 5,800 మందికి పైగా ప్రజలు మిజోరాంకు పారిపోయి వివిధ జిల్లాల్లో తలదాచుకున్నారని ఆదివారం అధికారులు తెలిపారు. మైతీలు, గిరిజనులకు మధ్య పరస్సర దాడులు పెరగడం వల్ల మణిపూర్ నుంచి చాలా మంది వలసబాటపట్టారు. మణిపూర్‌కు చెందిన 5800 మందికిపైగా మిజోరాంలోని వివిధ జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నారని అధికారులు తెలిపారు. వారంతా చిన్, కుకి, మిజో తెగలకు చెందివారేనని చెప్పారు. వీరంతా మిజోరాంలోని ఆరు జిల్లాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో తల దాచుకుంటున్నారని వెల్లడించారు.
Read Also: CBI Director: సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్.. కర్ణాటక డీజీపీకి కేంద్రం కీలక బాధ్యతలు
ప్రస్తుతం ఐజ్వాల్ జిల్లాలో అత్యధికంగా 2021 మంది ఆశ్రయం పొందారని , ఆ తర్వాతి స్థానాల్లో కొలాసిబ్ (1,847), సైచువల్ (1,790) ఉన్నారని చెప్పారు. ఇదిలావుండగా, గిరిజనులకు ప్రత్యేక పరిపాలన కోసం మణిపూర్ గిరిజన ఎమ్మెల్యేల డిమాండ్‌ను మిజోరాం లోక్‌సభ సభ్యుడు సి లాల్‌రోసంగ సమర్థించారు. మణిపూర్ ప్రభుత్వంలో ఆదివాసీ ప్రజలు ఇకపై ఉండలేరని పేర్కొంటూ, హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ప్రత్యేక పరిపాలనను రూపొందించాలని బీజేపీకి చెందిన ఏడుగురు సహా 10 మంది కుకీ ఎమ్మెల్యేలు శుక్రవారం కేంద్రాన్ని కోరారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న కొండ జిల్లాల్లో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించడంతో మణిపూర్‌లో ఘర్షణలు చెలరేగాయి. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ నుంచి కుకీ గ్రామస్తులను తొలగించడంపై ఉద్రిక్తతతో హింస చెలరేగింది. మణిపూర్ జనాభాలో మైతీలు దాదాపు 53 శాతం ఉన్నారు. ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజనులు, నాగాలు, కుకీలు జనాభాలో మరో 40 శాతం ఉన్నారు. కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.