Site icon NTV Telugu

Operation Sindhu: ఇరాన్‌-ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల్లో భారతీయులకు ఊరట.. “ఆపరేషన్ సింధు” ద్వారా భారత్ రక్షణ చర్యలు..

Operation Sindhu

Operation Sindhu

Operation Sindhu: ఇరాన్‌-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం “ఆపరేషన్ సింధు” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా అక్కడవున్న భారత విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో.. తెహ్రాన్‌లో ఉన్న భారత విద్యార్థులను భారత దౌత్య కార్యాలయ సమన్వయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది.

Read Also: Donald Trump: “ఐ లవ్ యూ పాకిస్తాన్”.. ఆసిమ్ మునీర్‌పై ట్రంప్ ప్రశంసలు..

అధికారుల ప్రకారం తొలి ఎవాక్యుయేషన్ విమానం ఆర్మేనియా రాజధాని యెరెవాన్ నుంచి భారత్ కు రానుంది. ఈ విమానం గురువారం (జూన్ 19) తెల్లవారుజామున 2 గంటల సమయంలో న్యూఢిల్లీలో ల్యాండ్ కానుంది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. భారత్ ‘ఆపరేషన్ సింధు’ ప్రారంభించింది. ఉత్తర ఇరాన్‌ నుండి 110 మంది భారతీయ విద్యార్థులను ఇరాన్‌, ఆర్మేనియాలోని మిషన్ల సమన్వయంతో ఆర్మేనియా దేశానికి తరలించాం. వారిని యెరెవాన్ నుండి ప్రత్యేక విమానంలో తరలించి జూన్ 19 తెల్లవారుజామున న్యూఢిల్లీకి తీసుకురానున్నాం అని తెలిపారు.

Read Also: Tatkal Ticket – Aadhaar: తత్కాల్ టికెట్ కు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి.. ఆధార్ లింక్ చేయాలంటే సింపుల్ గా ఇలా చేస్తే సరి..!

ఇజ్రాయిల్ తాము ప్రారంభించిన “ఆపరేషన్ రైజింగ్ లయన్” ద్వారా ఇరాన్‌పై పలు ప్రాంతాల్లో పెద్దెత్తున దాడులు చేస్తున్నది. ఈ దాడుల వల్ల ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, భారత్ తక్షణ చర్యగా తన పౌరులను బయటకు తరలించేందుకు రంగంలోకి దిగింది. వీటితో పాటు, అక్కడే ఉన్న భారతీయులకు తెహ్రాన్‌ను వదిలి వెళ్లాలని సూచనలు ఇవ్వబడ్డాయి. కొందరు భారతీయులు ఇరాన్-ఆర్మేనియా సరిహద్దు ద్వారా బయటకు వెళ్లేందుకు సహాయపడినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉర్మియా మెడికల్ యూనివర్సిటీ నుండి 110 మంది విద్యార్థులు, అందులో 90 మంది కాశ్మీర్ లోయకు చెందినవారు సురక్షితంగా ఆర్మేనియా దేశంలోకి ప్రవేశించారని తెలిపారు.

ఇరాన్‌లో పరిస్థితి ఉత్కంఠభరితంగా ఉన్నందున, తదుపరి మార్గదర్శకాలను త్వరలో జారీ చేస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. మొత్తంగా, ఇరాన్‌లోని భారత్ పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్ సింధు” ద్వారా తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇవ్వనున్నాయి.

Exit mobile version