Online Betting App Scam: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్‌వర్క్!

Ap Liquor Scam Ed

Ap Liquor Scam Ed

Online Betting App Scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ మోసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సోదాలకు గత వారం ఉత్తరాది, పశ్చిమ భారతంలో ఈడీ నిర్వహించిన మెరుపు దాడులే మూలకారణంగా తేలింది.

పూణే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద రంగంలోకి దిగిన ఈడీ, గత వారం ముంబై, పూణే, సూరత్, మెహసానా నగరాల్లోని 20కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో అక్రమార్కుల ఆర్థిక మూలాలు బట్టబయలయ్యాయి. ముఖ్యంగా ‘ఐపైసా’ వంటి గేమింగ్ మరియు చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చట్టవిరుద్ధ బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

విచారణలో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సామాన్యులను ఆశచూపి కొల్లగొట్టిన సొమ్మును నేరుగా తరలించకుండా, దేశవ్యాప్తంగా 200లకు పైగా బోగస్ (షెల్) కంపెనీలు, పలు కో-ఆపరేటివ్ బ్యాంకుల ఖాతాలను ఉపయోగించి మళ్లించినట్లు ఈడీ తేల్చింది. ఈ నిధులను క్రిప్టోకరెన్సీలుగా మార్చి దుబాయ్‌తో పాటు ఇతర విదేశీ ఖాతాలకు చేరవేసినట్లు సాంకేతిక ఆధారాలు లభ్యమయ్యాయి.

గత వారం నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, నగదు లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకోవడంతో పాటు అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను ఈడీ స్తంభింపజేసింది. అంతేకాకుండా ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఎడ్‌సోమ్ ఫిన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు రాంధానీని ఈడీ అరెస్ట్ చేసి విచారించింది. ఆ విచారణలో వెల్లడైన ఆధారాలు, సీజ్ చేసిన డిజిటల్ డేటా లింకుల ఆధారంగానే తాజాగా హైదరాబాద్, విజయవాడల్లోని లోకల్ ఏజెంట్లు, హవాలా ఆపరేటర్లపై ఈడీ ఏకకాలంలో దాడులకు దిగింది.