OnePlus Open 2: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఒక్కసారిగా కుదిపేసిన వన్‌ప్లస్ ఓపెన్‌కు సీక్వెల్‌గా వస్తున్న వన్‌ప్లస్ ఓపెన్ 2 భవిష్యత్తులో వచ్చే అవకాశం రాకనిపించడం లేదు. స్మార్ట్‌ప్రిక్స్ (SmartPrix) నివేదిక ప్రకారం.. వన్‌ప్లస్ ఓపెన్ 2 గ్లోబల్ లాంచ్‌ను సంస్థ రద్దు చేసినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది వేసవిలో వన్‌ప్లస్ ఓపెన్ 2ను లాంచ్ చేయాలని మొదట కంపెనీ భావించింది. అలాగే, 2026 మూడో త్రైమాసికం (Q3) ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సిద్ధమైంది. కానీ, ఆ ప్రణాళికను ఇప్పుడు సైలెంట్ గా విరమించుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: Chairman’s Desk: ఏపీకి శాశ్వత రాజధాని కావాల్సిందే కానీ..!
మొదటి ఓపెన్ ఇచ్చిన షాక్..
2023లో విడుదలైన వన్‌ప్లస్ ఓపెన్, కంపెనీకి తొలి ఫోల్డబుల్ అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5కు గట్టి పోటీ ఇచ్చి, డిజైన్, డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్ అనుభవంలో వన్‌ప్లస్ సత్తా చాటింది. కానీ, సామ్‌సంగ్‌కు ఉన్న బలమైన ఎకోసిస్టమ్ మాత్రం ఇంకా ముందే ఉందనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. అయినప్పటికీ, వన్‌ప్లస్ ఫోల్డబుల్ రేస్‌లో ముందంజలోకి రావొచ్చన్న ఆశలు కలిగాయి. ఇప్పుడు ఆ ఊపు తగ్గినట్లుగా కనిపిస్తోంది.
రద్దుకు కారణం ఏమిటి?
వన్‌ప్లస్ అధికారికంగా ఎలాంటి కారణం మాత్రం వెల్లడించలేదు. అయితే, అధిక ధరల కాంపోనెంట్లు, ముఖ్యంగా హై-డెన్సిటీ ర్యామ్, అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ ఖర్చులు భారీగా పెరగడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇప్పటికే సాధారణ ఫ్లాగ్‌షిప్ ఫోన్లే ఖరీదైనవిగా మారుతుండటంతో పాటు ఫోల్డబుల్ ఫోన్లు ఖర్చు పరంగా మరింత రిస్క్‌గా మారాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ ధరలకు మార్కెట్లలో ఇలాంటి అల్ట్రా ప్రీమియం ఫోన్ల విక్రయం సవాలుగా మారింది.
ఓపెన్ 2 హార్డ్‌వేర్ వృథా కాదు
వన్‌ప్లస్ ఓపెన్ 2 ఇప్పటికే అడ్వాన్స్‌డ్ టెస్టింగ్ దశలో ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకుందని స్మార్ట్‌ప్రిక్స్ నివేదిక తెలిపింది. ఇక, ఈ హార్డ్‌వేర్ పూర్తిగా వృథా కావడం లేదు.. అదే డివైస్‌ను ఒప్పో బ్రాండ్ కింద ‘ఒప్పో ఫైండ్ N6’గా కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఇది ఏ దేశాల్లో లాంచ్ అవుతుంది అనే దానిపై క్లారిటీ లేదు.
స్పెసిఫికేషన్లు అదిరిపోయేలా
కాగా, వన్‌ప్లస్ ఓపెన్ 2 నిజంగా ఒక జనరేషన్ లీప్‌గా నిలిచేది. ఇందులో 8.12 అంగుళాల 2K ఫోల్డింగ్ డిస్‌ప్లే, 6.6 అంగుళాల AMOLED కవర్ స్క్రీన్ ఉండే ఛాన్స్ ఉంది. రెండింటికీ 165Hz రిఫ్రెష్ రేట్ అందించనున్నారు. పని తీరు కోసం క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, గరిష్ఠంగా 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ ఉండేలా ప్లాన్ చేశారు.
అలాగే, కెమెరా విభాగంలో మూడు 50MP రియర్ సెన్సార్లు, అవుటర్ డిస్‌ప్లేపై 32MP సెల్ఫీ కెమెరా, లోపల 20MP కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి. 6,000mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఇందులో భాగంగా ఉండేవి.
Read Also: Vijayawada: విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద దారుణం.. భక్తులపై పార్కింగ్ సిబ్బంది దాడి..
డిజైన్ కూడా ప్రత్యేకమే
డిజైన్ పరంగా కూడా ఓపెన్ 2 ఒక స్టేట్‌మెంట్ పీస్‌గా ఉండేది. బ్లాక్ ఫాక్స్ లెదర్ ఫినిష్‌తో ప్రోటోటైప్స్ తయారు అయ్యాయి. హువావే మేట్ X7 నుంచి ప్రేరణ పొందిన ఛాసిస్‌తో పాటు బ్లాక్ అండ్ కొత్త టైటానియం కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసింది. ఈ ఫోన్ల రద్దు నిజంగా జరిగితే.. భారత మార్కెట్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ సిరీస్‌కు ప్రత్యామ్నాయాలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఒప్పో ఫైండ్ N6 భారత్‌కు వస్తే మాత్రమే కొంత పోటీ ఉంటుంది.
వన్‌ప్లస్ 15s, నార్డ్ 6పైనా అనుమానాలు
ఓపెన్ 2 మాత్రమే కాదు భారత్‌లో రాబోయే రోజుల్లో వన్‌ప్లస్ ఫోన్లపై కూడా అనిశ్చితి నెలకొంది. గత ఏడాది చైనాలో విడుదలైన వన్‌ప్లస్ 13Tను భారత్‌లో వన్‌ప్లస్ 13sగా తీసుకువచ్చింది. ఈసారి వన్‌ప్లస్ 15Tను భారత్‌లో 15sగా విడుదల చేస్తుందని అంచనాలు ఉండేది. అయితే, వన్‌ప్లస్ 15s భారత్‌లో రద్దు అయ్యే అవకాశం దాదాపు 90 శాతం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో లాంచ్ చేయాల్సిన ఈ ఫోన్ టెస్టింగ్ దశలోనే ఆలస్యం అవుతూ, కొత్త టైమ్‌లైన్ లేకుండా నిలిచిపోయింది.