NTV Telugu Site icon

Stampede In Cuttack: జాతరలో తొక్కిసలాట.. ఒకరు మృతి, 20 మందికి గాయాలు

Stampede

Stampede

Stampede In Cuttack: ఒడిశాలోని కటక్ జిల్లాలో శనివారం జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారని, వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉందని పోలీసులు తెలిపారు. మకరమేళా సందర్భంగా బదాంబ-గోపీనాథ్‌పూర్ టి-బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడంతో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో 45 ఏళ్ల అంజనా స్వైన్ అనే మహిళ మరణించిందని, తీవ్రంగా గాయపడిన నలుగురిని కటక్ నగరంలోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారని బదాంబ-నర్సింగ్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేబి ప్రసాద్ మిశ్రా ధ్రువీకరించారు.

గాయపడిన ఇతర వ్యక్తులను బాదంబాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో చేర్చినట్లు మిశ్రా తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేస్తూ, మృతురాలి కుటుంబసభ్యులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత చికిత్స అందుతుందని, వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మకర సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన జాతరను, సింహనాథుని దర్శించుకునేందుకు మధ్యాహ్నం వేళ మహిళలు, చిన్నారులతో సహా భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అతఘర్ సబ్ కలెక్టర్ హేమంత కుమార్ స్వైన్ తెలిపారు.

Viral Video: దేశ రాజధానిలో దారుణం.. కారుతో ఢీకొట్టి.. అర కిలోమీటరు లాక్కెళ్లి..

కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తున్నందున భక్తుల తాకిడి భారీగా ఉందని జిల్లా యంత్రాంగం తెలిపింది. కటక్, ఖోర్ధా, పూరీ, అంగుల్, దెంకనల్, బౌధ్, నయాగఢ్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు.