ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో పిడుగు దాటికి తాండూరు పట్టణంలోని పాత తాండూరులో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే తాండూర్ నియోజకవర్గంలో వరుస పిడుగుపాటులు పడడంతో వ్యక్తులు మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు పిడుగుపాటుకు యాలాల మండలంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, 24 గంటలు గడవకముందే పిడుగుపాటుకు మరో వ్యక్తి బలయ్యాడు. పాత తాండూర్ సమీపంలో హోటల్ నిర్వహిస్తున్న శేఖర్ అనే వ్యక్తి కాలకృత్యాల కోసం బయటికి వెళ్ళగా, ఒక్కసారిగా పిడుగులు పడడంతో చెట్టు కింద ఉన్న శేఖర్ మృతి చెందాడు. చెట్టు కూడా కాలిపోయింది. మరోవైపు దగ్గరలో ఉన్న మైదానంలో క్రికెట్ ఆడుతున్న బాలుడు హనుమంతు వర్షానికి చెట్టు నీడకు వెళ్ళగా ఆ బాలుడికి కూడా గాయాలయ్యాయి. తాండూరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు. హోటల్ ను నడిపిస్తున్న శేఖర్ కు ఇద్దరు కుమారులు ఉండటంతో ఆకస్మాత్తుగా పిడుగు రూపంలో మృతి చెందడం వల్ల భార్య పిల్లల రోదనలు మిన్నంటాయి.