Site icon NTV Telugu

Shocking video: ఓ తల్లి క్రూరత్వం.. కన్న బిడ్డను ఏం చేసిందంటే..!

Son

Son

నవమాసాలు మోసి.. కని.. పెంచిన ఓ మాతృమూర్తి.. మృగం కంటే దారుణంగా ప్రవర్తించింది. భర్త మీద కోపమో.. లేదంటే ఇంకెవరి మీద కోపమో తెలియదు గానీ.. ముక్కుపచ్చలారని చిన్న బిడ్డపై ప్రతాపం చూపించింది ఓ కసాయి తల్లి. ఏ కన్నపేగు కూడా ఇంత దారుణంగా చేయదు. అలాంటిది అత్యంత దారుణంగా ప్రవర్తించి అమ్మ అనే పదానికి అర్థం లేకుండా చేసింది. ఈ ఘోరం హర్యానాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

 

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. అందులో ఓ తల్లి.. తన బిడ్డను ఇష్టానుసారంగా కొట్టడమే కాకుండా.. మంచంపై విసిరివేసి.. చిన్నారి ఛాతీపై కొన్ని నిమిషాల పాటు అలానే కూర్చుని ఊపిరాడకుండా చేసింది. ఆ పసి ప్రాణం విలవిలలాడిపోయింది. అంతటితో ఆగిందా అంటే.. పదే పదే చెంపదెబ్బలు కొట్టడం.. తన్నడం విజువల్స్‌లో కనిపించాయి. దాడి చేస్తూనే దుర్భాషలాడింది. తండ్రి వచ్చి ఆపే ప్రయత్నం చేసినా అతని మాట ఏ మాత్రం లెక్కచేయలేదు. అంతేకాకుండా బెదిరింపులకు దిగింది. జోక్యం చేసుకుంటే.. బిడ్డకు విషం ఇచ్చి.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో అతడు ఏమి చేయలేక మిన్నకుండిపోయాడు. కానీ ఈ బాగోతాన్ని మాత్రం సీసీ కెమెరాల్లో రికార్డ్ చేశాడు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె ఒక డాక్టర్‌ కావడం విశేషం.

ఇక తన భర్త.. తాగుబోతని నిందవేసింది. పైగా అతనిని ఏ మాత్రం లెక్కచేయలేదు. కొంచెం కూడా భయం కనిపించలేదు. దీనిని బట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత లేనట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం వీడియో మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా పలుమార్లు.. ఆ చిన్నారిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య దుర్మార్గాన్ని వీడియోలతో సహా సమర్పించాడు. జోక్యం చేసుకుంటే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్య క్రూరత్వాన్ని బయటపెట్టేందుకే ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు అతడు చెప్పాడు.

ఇక ఈ ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) మండిపడింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి) ఆదేశాల మేరకు సూరజ్‌కుండ్ పోలీస్ స్టేషన్‌లో తల్లిపై క్రూరత్వ కేసు నమోదు అయింది. ఎన్నికల విధుల కారణంగా చిన్నారి వాంగ్మూలాన్ని నమోదు చేయలేదని సూరజ్‌కుండ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ షంషేర్ సింగ్ తెలిపారు.

ఇక ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిందితురాలిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారిపై ప్రతాపం చూపించడమేంటి? అని నిలదీస్తున్నారు.

 

Exit mobile version