NTV Telugu Site icon

Dharmpuri: ధర్మపురి అసెంబ్లీ ఫలితాల వివాదం.. నేడు స్ట్రాంగ్‌రూంను తెరవనున్న అధికారులు

Strong Room

Strong Room

Dharmpuri: హైకోర్టు ఆదేశాలతో ధర్మపురి శాసనసభ నియోజకవర్గ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంను సోమవారం ఉదయం 10 గంటలకు అధికారులు తెరవనున్నారు. 2018 నాటి ఎన్నికల ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరిగాయని కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అక్రమమని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో ఈవీఎంలను జగిత్యాల వీఆర్‌కే ఇంజినీరింగ్‌ కళాశాలలో భద్రపరిచి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అప్పటి రిటర్నింగ్‌ అధికారి భిక్షపతి ఉద్యోగ విరమణ చెందడంతో న్యాయస్థానానికి హాజరు కాకపోగా వారెంట్‌ జారీచేసి గత నెల 21లోగా హాజరుపర్చాలని రాచకొండ పోలీసు కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.

Read Also: CM KCR: యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి..

ఎన్నికల ఫలితాలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంను తెరిచి అప్పటి ఎన్నికకు సంబంధించిన 17ఏ,17 సీ డాక్యుమెంట్ కాపీలను, కౌంటింగ్ సీసీ ఫుటేజి, ఎన్నికల ప్రొసీడింగ్స్‌ను ఈనెల 11న సమర్పించాలని ఆ సమయంలో ఉన్న రిటర్నింగ్ అధికారి భిక్షపతిని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో భిక్షపతి న్యాయస్థానంలో హాజరై వివరణ ఇచ్చారు. ఈనెల 11లోగా వివరాలు సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన జగిత్యాలకు వచ్చి జిల్లా కలెక్టర్‌కు వివరాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం జగిత్యాల జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా సమక్షంలో స్ట్రాంగ్‌రూం తెరిచి ఎన్నికలకు సంబంధించిన వివరాలను రిటర్నింగ్‌ అధికారికి అప్పగించనున్నారు.

 

Show comments