ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యేందుకు డెడ్ లైన్ 9.45 కావటంతో.. పరీక్షా కేంద్రాల వద్ద గేట్లకు సిబ్బంది తాళాలు వేశారు. ఇదే సమయంలో విజయవాడ నలంద విద్యా నికేతన్‌లోని గ్రూప్-2 పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా దివ్యాంగుడైన అభ్యర్ధి వచ్చారు. అయితే తన భర్త దివ్యాంగుడు కావటంతో పరీక్షకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని అతడి భార్య ప్రాధేయ పడింది. దీంతో దివ్యాంగునికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు హాజరయ్యేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు.
కేవలం నిమిషంలోపు మాత్రమే ఆలస్యం కావటం.. అభ్యర్ధి దివ్యాంగుడు కావటంతోనే మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చామని అధికారులు అంటున్నారు. అధికారుల తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎంవీజీఆర్ కాలేజీ సెంటర్‌కు గ్రూప్-2 అభ్యర్థి అక్కిన మనోహర్ నాయుడు ఆలస్యంగా చేరుకున్నాడు. పది నిమిషాలు ఆలస్యం కావడంతో ఎగ్జామ్ సెంటర్ లోనికి అధికారులు అనుమతించలేదు. దాంతో మనోహర్ ఏడ్చుకుంటూ వెనుదిరిగాడు. కోవూరు మండలం గంగవరంలోని పరీక్షా కేంద్రానికి ఓ అభ్యర్థి ఆలస్యంగా వచ్చాడు. అభ్యర్థి బ్రతిమాలినా అధికారులు లోనికి అంగీకరించలేదు.
బెజవాడ స్టెల్లా కళాశాలకు సమయం ముగిసిన తర్వాత నలుగురు గ్రూప్-2 అభ్యర్థులు వచ్చారు. సమయం దాటిందని పరీక్షకి అధికారులు అనుమతించలేదు. ఇద్దరు అభ్యర్థులు హైద్రాబాద్ కోచింగ్ సెంటర్, మరో ఇద్దరు అవనిగడ్డ తెనాలి నుంచి ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వచ్చారు. పరీక్ష కేంద్రం గేట్లు వేయటంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.