NTV Telugu Site icon

Off The Record : వైసీపీ ఒంగోలు నేతలు గరంగరం..?

Otr Ycp Ongole

Otr Ycp Ongole

వైసీపీలో ఒంగోలు వార్‌ మొదలైందా? జిల్లా అధ్యక్ష పదవి విషయంలో స్థానిక నేతలు గరం గరంగా ఉన్నారా? మమ్మల్ని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటే… ఆ తర్వాత మీ ఇష్టం అంటూ అధిష్టానానికి స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చేశారా? ఇంతకీ ఒంగోలులో ఏం జరుగుతోంది? స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నది ఎవర్ని? జిల్లా అధ్యక్ష పదవి చుట్టూ ముసురుకుంటున్న ముసలం ఏంటి? ఏపీలో వైసీపీకి పట్టున్న జిల్లాల్లో ప్రకాశం కూడా ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి జిల్లాలో చెప్పుకోదగ్గ స్దానాలే దక్కుతున్నాయి. పార్టీ అధినేత జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి, వైవీ బావమరిది బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇదే జిల్లాకు చెందిన వారు కావటం, ఇద్దరూ కీలకంగా వ్యవహరిస్తుండటం పార్టీకి ప్లస్‌ అవుతోంది. తర్వాత సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూస్తుండటంతో ప్రకాశం జిల్లా పార్టీకి బాలినేనే పెద్ద దిక్కుగా ఉన్నారు. అలాగే గత ఎన్నికల సమయంలో ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డికి పార్టీ టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో టీడీపీ షిఫ్ట్ అయ్యారాయన. దీంతో ఆయన స్థానంలో చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బరిలో దింపింది పార్టీ అధినాయకత్వం. చెవిరెడ్డి వద్దంటూ అప్పట్లోనే జగన్‌తో గట్టిగా మాట్లాడారట బాలినేని. వలస నేతలతో జిల్లాలో సమీకరణలు మారిపోతాయంటూ లెక్కలు కూడా చెప్పినట్టు తెలిసింది. అయినా తన మాట నెగ్గకపోవడంతో అప్పటికి వెనక్కి తగ్గారు బాలినేని. కానీ… ఆయన ఊహించినట్టుగానే… మాగుంట టీడీపీ అభ్యర్దిగా బరిలో నిలవటం, చెవిరెడ్డి జిల్లాలో పూర్తిస్దాయిలో నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోవడంతో… పాతికేళ్ళ తర్వాత తెలుగుదేశం ఖాతాలో పడిపోయింది ఒంగోలు ఎంపీ టిక్కెట్‌.

దాదాపు 25, 30 ఏళ్ల తర్వాత గిద్దలూరు, మార్కాపురం వంటి స్దానాల్లో సైతం టీడీపీ జెండా ఎగరేయగలిగింది. ఈ క్రమంలో ఫలితాల తర్వాత దాదాపు నెల రోజుల నుంచి హైదరాబాద్ కే పరిమతమయ్యారట బాలినేని. ఈ పరిస్థితుల్లో వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ప్రకటిస్తారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. జిల్లా నాయకులు ఎవర్నీ సంప్రదించకుండా అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ మండిపడుతోందట ద్వితీయ శ్రేణి. ఎన్నికల ఫలితాలు చూశాక పార్టీని పునర్నిర్మించుకోవాల్సిన టైంలో వేరే జిల్లా నాయకుడిని ఇక్కడ ఎలా అధ్యక్షుడిని చేస్తారంటూ ఫైరైపోతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో పార్టీ ఏమై పోయినా ఫర్వాలేదు.. మేం అనుకున్నట్లే అంతా జరగాలన్న భావనను పార్టీ పెద్దలు వదులుకోకుంటే… భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న వార్నింగ్‌లు సైతం వస్తున్నాయట కేడర్‌ నుంచి. అటు బాలినేని సైతం అదే తరహా అసంతృప్తితో ఉన్నట్టు చెబుతోంది ఆయన వర్గం. చెవిరెడ్డి పోకడల వల్ల ఒకటి, రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్దులు ఓడిపోవాల్సి వచ్చిందని, మళ్లీ ఆయన్నే జిల్లా అధ్యక్షుడిని చేస్తే…. ఇక మేం కార్యకర్తల దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలంటూ అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. 2014లో పార్టీ ఓడిపోయినప్పుడు ఐకమత్యంగా ఏం చేశామో, మళ్ళీ 2019లో ఎలా బలోపేతం చేయగలిగామో పెద్దోళ్లు గుర్తుకు తెచ్చుకోవాలన్నది బాలినేని అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు.

అటు కార్యకర్తల్లో సైతం జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడిని కాదని ఎలా నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతోందంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసినా… తిరుపతి నుంచి షటిల్ సర్వీస్‌ చేశారే తప్ప ఫుల్ టైం ఇక్కడ కూర్చుని రాజకీయాలు చేయలేదని అంటున్నారు ప్రకాశం వైసీపీ లీడర్స్‌. పొదిలిలో ఓ ప్రైవేట్ కాలేజీలో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని తన ఎన్నికల టీంను అక్కడి నుంచి ఆపరేట్ చేసిన చెవిరెడ్డి… కనీసం ఒంగోలులో తన ఆఫీస్‌ పెట్టలేదని, అలాంటి వ్యక్తికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎలా ఇస్తారన్నది పార్టీ నేతల క్వశ్చన్‌. అలాగే ఫలితాల తర్వాత జిల్లాకు ఒక్కసారి కూడా రాలేదన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. ఏతావాతా చెవిరెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి విషయంలో బాలినేని సీరియస్ గానే ఉన్నట్లు సమాచారం. జిల్లా నేతలతో చర్చించకుండా అధిష్టానం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే అంతిమంగా పార్టీనే నష్టపోవాల్సి వస్తుందని తేల్చి చెప్పారట. మాతో సంబంధం లేకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకుంటే… మా నిర్ణయాలు కూడా మాకుంటాయని తనతో మాట్లాడిన పార్టీ పెద్దలతో అన్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఒంగోలు వైసీపీ రాజకీయం రక్తికడుతోంది.