అక్కడ కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట జోరుగా నడుస్తోందా? ఓ కాంగ్రెస్, బీ కాంగ్రెస్ అంటూ వర్గాలుగా విడిపోయి తన్నుకుని తలంట్లు పోసుకుంటున్నారా? చివరికి పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాన్నే రసాభాస చేసుకున్నారా? ఆ యుద్ధం అసలు అధిష్టానం చెక్ పెట్టగలిగే స్థాయిలో ఉందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? మూడు ముక్కలాట ఆడుతున్న ఆ నాయకులెవరు? వికారాబాద్ జిల్లా అధికార పార్టీలో నేతల మధ్య ఐక్యత లోపించింది. ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచినా… సఖ్యత మాత్రం లేదంటున్నారు. ఇంకా చెప్పాలంటే… పరస్పరం గోతులు తీసుకుంటున్నారట. ఇటీవల తాండూరు నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ముఖ్య నేతల మధ్య అభిప్రాయ భేదాలు బయటపడ్డాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యుడు రమేష్ మహరాజ్ మధ్య సఖ్యత లేదని తేలిపోయింది. తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాక సమావేశం వికారాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, అబ్జర్వర్లు వినోద్ రెడ్డి, నరేందర్ హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి కార్యకర్తలకు వివరించి బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళమని సూచించారు నాయకులు.
అంతవరకు బాగానే ఉన్నా…. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహరాజ్‌కు వేదిక మీద చోటు లేకపోవడం వివాదానికి దారి తీసింది. పైన కుర్చీ లేక ముందు కార్యకర్తల మధ్యనే కూర్చున్న రమేష్‌ని… ఆ తర్వాత వేదికపైకి ఆహ్వానించడంతో వెళ్ళారు. తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే… మహరాజ్‌లని, స్థానికంగా పార్టీకి బీజం వేసిన నాయకులు, కార్యకర్తలను ప్రస్తుతం ఉన్న బి కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడంలేదని వేదిక మీది నుంచే… రమేష్ మహరాజ్ అనడంతో కలకలం రేగింది. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేయడంతో…వేదికపై ఉన్న నాయకులు ఒక్కసారిగా షాకయ్యారట. రమేష్ మహరాజ్ వ్యాఖ్యలతో జిల్లా కాంగ్రెస్‌లో విబేధాలు బయటపడ్డట్టయిందని అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ హవా నడుస్తోందని బాహాటంగానే విమర్శించినట్టయింది. ప్రస్తుతం తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఫైనాన్స్ కమిషన్ మెంబర్, మాజీ ఎంపీ… ఇలా రకరకాల వర్గాలు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఎవరికి వారు విడిపోవడంతో… అది పార్టీ కార్యక్రమం అయినా, ప్రభుత్వ కార్యక్రమం అయినా నాయకుల అనుచరులు, కార్యకర్తల మధ్య ఘర్షణలు సర్వసాధారణమైపోయాయి. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరక ముందే కాంగ్రెస్ అధిష్టానం నాయకులకు కళ్లెం వేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది పార్టీ వర్గాల నుంచి. ప్రస్తుతం చిన్న చిన్న గొడవలతో ముగుస్తున్నా… భవిష్యత్ లో అది ముదిరి పోలీస్ కేసులు, కోర్టుల వరకు వెళ్లక ముందే జాగ్రత్తలు తీసుకుంటే పార్టీకే మంచిదనే సూచనలు వస్తున్నాయి. మరి తాండూరు కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత కుదురుతుందా? ఒకరిపై మరొకరు పైచేయి సాధించే క్రమంలో ఎవరు ఎంతవరకు సర్దుకుపోతారన్నది ప్రశ్నార్ధకంగా ఉంది.
