NTV Telugu Site icon

Off The Record : శింగనమల, మడకశిరలో తప్పిన వైసీపీ లెక్క..మళ్లీ జనానికి కనిపించని అభ్యర్థులు

Ycp Otr

Ycp Otr

కులబలం, ధనబలం, పొలిటికల్ ట్రాక్ రికార్డు.. ఈ లెక్కలన్నీ వేసినా.. ఓ పాతిక ముప్పయ్ కోట్లు చేతిలో ఉండాల్సిందే! ఆ మాత్రం బరువు లేనిదే ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వదు! ఈ సంగతి అందరికీ తెలుసు. అలాంటి సినారియోలో ఓ ఇద్దరికి సామాన్యులకు టికెట్స్‌ ఇచ్చారా అధినేత. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఇద్దరూ ఓడిపోయారు! తర్వాత మాయమయ్యారు! ప్రయోగం వికటించినా ఇంతవరకు విరుగుడు మంత్రమేంటో అధినేత చెప్పడం లేదట.

Off The Record : టార్గెట్ కాంగ్రెస్..దసరా తర్వాత బీఆర్ఎస్ లో పదవుల పందేరం

ఏపీ రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా 2024 ఎన్నికల ముందు వైసీపీ చేసిన ప్రయోగాలు మరే పార్టీ చేయలేదు. ముఖ్యంగా టికెట్ల విషయంలో అధినేత జగన్ అనుసరించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేలను మరో నియోజకవర్గానికి ట్రాన్స్‌ఫర్ చేయడం… అసలు అప్పటివరకు రేసులో ఊసులో లేని నేతలను సడెన్‌గా తెరపైకి తీసుకురావడం.. ఇలా అనేక ఎక్స్‌పరిమెట్స్ చేశారు జగన్. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి సామాన్యులకు టికెట్లు అంటూ అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. కులబలం, ధనబలం, పొలిటికల్ ట్రాక్ రికార్డు.. ఇలాంటివన్నీ లెక్కలేసి.. ఓ పాతిక- 30 కోట్లు చేతిలో లేనిదే ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వదన్న సంగతి అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లోనూ కామన్‌మ్యాన్‌కి టికెట్స్‌ ఇచ్చారు. అందునా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో జగన్ డేరింగ్ స్టెప్ వేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శింగనమల, మడకశిర నియోజకవర్గాలు ఉన్నాయి. ఈరెండు చోట్ల జగన్ చేసిన ప్రయోగం ఒక సాహసమనే చెప్పాలి. శింగనమలలో ఒక సామాన్య టిప్పర్ డ్రైవర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. మడకశిరలో ఒక ఉపాధిహామీ కూలికి బీఫాం ఇచ్చారు. జగన్ చేసిన ప్రయోగం రాజకీయాల్లో పెను సంచలనమైంది. అక్కడ పోటీ చేసిన అభ్యర్థుల గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు.

కట్ చేస్తే ఆ ఇద్దరు అభ్యర్థులు. ఓటమిపాలయ్యారు. కాకపోతే మిగిలిన అభ్యర్థుల కంటే మెరుగ్గా ఓట్లు సాధించి జగన్ అంచనాలు తప్ప లేదన్న విధంగా ఓట్లు రాబట్టారు. శింగనమలలో మన్నెపాకులు వీరాంజనేయులు టీడీపీ అభ్యర్ధిపై 8వేల 700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై పెద్దగా వ్యతిరేకత లేనప్పటికీ అధినేత జగన్ అన్ని అంశాలు పరిశీలించి.. సాంబశివారెడ్డిని తగ్గించకుండా ఆయన చెప్పిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అయితే వీరాంజనేయులును కొందరు వ్యతిరేకించారు. అయినప్పటికీ జగన్ వెనక్కి తగ్గలేదు. వాస్తవంగా టీడీపీ నుంచి పోటీ చేసిన బండారు శ్రావణికి సానుభూతితో పాటు కూటమి వేవ్ ఉందనుకున్న సమయంలో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు ఏమాత్రం పోటీ ఇవ్వలేరని అంతా భావించారు. కానీ వీరాంజనేయులు అనూహ్యంగా గ్రౌండ్‌లో దూసుకొచ్చారు. చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. బ్యాడ్ లక్ ఏంటంటే.. గత నాలుగు నెలల్లో ఒకటీ రెండుసార్లు మినహా వీరాంజనేయులు కనిపించలేదు.

Off The Record : ఆదోని వైసీపీలో అయోమయం..కేడర్ జారిపోతున్నా పట్టించుకోని సాయిప్రసాద్ రెడ్డి

ఇక మడకశిర! ఈ నియోజకవర్గం కూడా ఎస్సీ రిజర్వు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై వ్యతిరేకత ఉండటంతో ఆయనని తప్పించాలని అధినేత జగన్ అనుకున్నారు. కానీ సరైన అభ్యర్థి లేక ప్రయోగానికి సిద్ధపడ్డారు. ఒక ఉపాధి హామీ కూలీకి టికెట్ ఇస్తే ఎలావుంటుందని ఆలోచించారు. మిగతా నాయకులు కూడా ఛలో కానీయండి సర్ అన్నట్టుగా సపోర్ట్ చేశారు. రేకుల షెడ్డులో నివాసం ఉంటున్న ఈరలక్కప్ప అభ్యర్ధిగా డిసైడయ్యారు. సామాన్యులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్న అధినేత ఉద్దేశాన్ని, సంకల్పాన్ని అందరూ అభినందించారు. అయితే అవతల పార్టీ టీడీపీలో సునీల్ కుమార్ అభ్యర్ధిత్వంపై ఏకాభిప్రాయం రాకపోవడంతో క్యాండిడేట్ మారారు. ఎంఎస్ రాజుకు టికెట్ ఇచ్చారు. అయితే మారిన సమీకారణాలను బట్టి చూస్తే ఈర లక్కప్ప ఈజీగా గెలుస్తారని వైసీపీలో అంతా భావించారు. అనుకున్నట్టే నెట్టుకొచ్చారు కానీ, లక్కప్ప లక్కు బాలేక ఓడిపోయారు. జస్ట్ 350 ఓట్ల తేడాతో టీడీపీ గెలిచింది. అయితే ఓడిన లక్కప్ప ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. గత నాలుగు నెలలుగా ఆయన ఎక్కడా పర్యటించిన దాఖలాలు లేవు. ఇంకో విషయం ఏంటంటే.. ప్రస్తుతం మడకశిర వైసీపీలో యాక్టివ్ లీడర్స్ ఎవరూ లేరట. రెండు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటన్నది కేడర్‌కు అర్థం కావడం లేదు. నాలుగు నెలలైనా ఇక్కడ పార్టీ గురించి ఆలోచించేవారు లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.