NTV Telugu Site icon

Off The Record : జంపింగ్స్తో వైసీపీ ఉక్కిరి బిక్కిరి

Ysrcp Otr

Ysrcp Otr

వైసీపీకి ఇంకో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారా? ఆల్రెడీ ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రిజైన్‌ చేయగా ఇంకో ఇద్దరు అదే రూట్‌లో ఉన్నారన్నది నిజమేనా? ఈ రాజీనామాల పరంపరపై పార్టీ అధిష్టానం వైఖరి ఎలా ఉంది? వెళ్ళే వాళ్ళని ఆపే ప్రయత్నం ఏదన్నా జరుగుతోందా? లేక పోతేపోనీ అనుకుంటున్నారా? జంపింగ్స్‌ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? రెండు నెలల క్రితం వరకు ఏపీలో తిరుగులేని ఆధిపత్యంతో రాజకీయం చేసిన వైసీపీకి ప్రస్తుతం వరుసబెట్టి సమ్మెట పోట్లు తగులుతున్నాయని అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. ఆకాశమంత ఎత్తులో 151 మంది ఎమ్మెల్యేలతో ఐదేళ్ళు అధికారం చెలాయించిన పార్టీ చివరికి 11 సీట్లతో అధహ్‌ పాతాళానికి పడిపోవడంతో కష్టాలన్నీ ఒక్కసారిగా చుట్టు ముడుతున్నాయని అంటున్నారు. ఆ పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికే రాజీనామాలు చేశారు. వీళ్ళందరి అడుగులు టీడీపీ వైపే పడుతున్నట్టు సమాచారం. వీరికి తోడు ఇంకో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కూడా ఫ్యాన్‌ పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఎవరా ఇద్దరంటూ తెగ ఆరా తీస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఫలానా వాళ్ళంటూ విశ్లేషణలు కూడా పెరిగిపోతున్నాయి. మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఎక్కువ మంది పక్కకు వెళ్లిపోతారని, కొందరు టీడీపీ, మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఆ పార్టీ వర్గాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోందట.

ఐదేళ్ల పాటు పదవులు అనుభవించిన వాళ్ళు, ఇప్పుడు అనుభవిస్తున్న వాళ్ళు కూడా…బైబై చెప్పేయడం ఏంటో అర్ధంగాక వైసీపీ అధిష్టానం డైలమాలో ఉందన్న టాక్‌ నడుస్తోంది రాజకీయవర్గాల్లో. మరోవైపు ఇప్పటికే రాజీనామాలు చేసిన కొందరు నేతల్ని ఆపేందుకు పార్టీ ముఖ్యులు ప్రయత్నించినా వర్కౌట్‌ కాలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. కొందరైతే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని మరీ… రాజీనామాలు చేసేస్తున్నారట. అలాగే ఇంకా ఏళ్ల తరబడి పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ రాజీనామాలు చేయటం వెనక కారణాలేంటని కూడా వైసీపీ అధిష్టానం ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే ఇదే సమయంలో రాజీనామా చేసి వెళ్లిపోతున్న వాళ్ళను ఆపడానికి సీరియస్‌గానే ప్రయత్నిస్తున్నారా? లేక ఏదో ఫార్మాలిటీకి ప్రయత్నించి వదిలేస్తున్నారా అన్న చర్చ సైతం జరుగుతోందట వైసీపీ వర్గాల్లో. పెద్దలు సీరియస్‌గా ప్రయత్నించకుండా… బుజ్జగింపుల రాజకీయం మనకు వర్కౌట్‌ కాదని వదిలేస్తున్నారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట వైసీపీ వర్గాల్లో. అసలు మోపిదేవివంటి నేతలు పార్టీని వీడటం కొంత ఆశ్చర్యంతో పాటు ఇబ్బంది కలిగించినా… చేసేదేం లేక వదిలేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తం అయిందట. ఇక ఇటు వరుస రాజీనామాలపై పార్టీ నుంచి కీలక నేతలు కూడా రియాక్ట్ అవుతూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటినుంచి జగన్ నాయకుల్ని నమ్ముకోలేదని, జనాన్ని నమ్ముకుని మాత్రమే రాజకీయం చేశారని అంటున్నారు పార్టీ సీనియర్స్‌. పార్టీని వదిలి పదవులు కోసం వెళ్ళిన వాళ్ళు పరువు పోగొట్టుకున్నారన్నది కొందరు సీనియర్స్‌ అభిప్రాయం.

కొంతమంది నేతలు రాజీనామా చేస్తే మిగతా వాళ్ళు కూడా అదే బాటలో ఉన్నారంటూ దుష్ట్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి. మొదటి నుంచి తాము జగన్ వెంటే ఉన్నామని, ఎప్పటి వరకు అయినా ఆయనతోనే మా అడుగులు అన్నారు ఇద్దరూ. మరోవైపు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్న నేతలను ఆపేందుకు కొంతమేర ప్రయత్నాలు జరుగుతున్నా… ఎక్కువ మంది మాత్రం రాజీనామాలకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. దీంతో నమ్ముకుని ఉన్నవాళ్ళతోనే… ముందుకు వెళ్లాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. నిర్ణయం ఎలా ఉన్నా… వోవరాల్‌గా జంపింగ్స్‌ మాత్రం వైసీపీ అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయన్నది రాజకీయవర్గాల అభిప్రాయం.