NTV Telugu Site icon

Off The Record : ఆ ఉమ్మడి జిల్లా వైసీపీలో ఏం జరుగుతుంది..? ఆ మాజీ మంత్రి మనసులో మాటేంటి..

Ycp Otr

Ycp Otr

ఆ ఉమ్మడి జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? ఒకప్పుడు పార్టీకి పట్టున్న జిల్లాలో క్రమంగా అంధకారం అలముకుంంటోందా? పక్క పార్టీల్లోకి క్యూ కట్టే నేతల సంఖ్య పెరుగుతోందా? ఇప్పటికే ఓ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పక్కకు జరగ్గా… జిల్లాలో పార్టీకి ఆయువుపట్టు లాంటి నేత కూడా బైబై చెప్పేస్తారా? ఇన్నాళ్ళు ఖండించిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు పరోక్షంగా మనసులో మాటను చెప్పకనే చెప్పారా? ఇంత జరుగుతున్నా సెట్‌ చేయగలిగిన ట్రబుల్‌ షూటర్‌లేని ఆ జిల్లా ఏది? ఏమా కథ? ఒకప్పుడు గట్టి పట్టున్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పడు వైసీపీ పరిస్థితి చుక్కానీ లేని నావలా తయారైందన్న అభిప్రాయం బలపడుతోంది. ఆ పార్టీ నేతలు వరుసబెట్టి బైబై చెప్పి సైకిలెక్కేస్తున్నారు. పోతుల సునీత పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడంతో… ఇప్పుడీ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా, పార్టీ మౌత్‌పీస్‌గా ఉన్న పోతుల సునీత ఫ్యాన్‌ కింది నుంచి పక్కకు జరిగేశారు. ఆమె ఇక టీడీపీ కండువా కప్పుకోవడమే తరువాయి అన్న మాట వినిపిస్తోంది రాజకీయవర్గాల్లో. ఒకప్పుడు పరిటాల రవి అనుచరులు అయిన పోతుల సునీత, ఆమె భర్త సురేష్‌ మావోయిస్టు రాజకీయాల నుంచి టిడిపిలో చేరారు. చీరాల నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓడిన సునీతకు 2017లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అయితే 2019 ఎన్నికల తర్వాత ఆ పార్టీ అధికారం కోల్పోవటంతో… తనకు మరో మూడేళ్ళ పదవీకాలం ఉండగానే రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఆమె. తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు జగన్‌. ఆ పదవీకాలం ముగిశాక ఎక్స్‌టెన్షన్ కూడా దక్కింది. వైసీపీలో చేరిన నాటి నుంచి ఆమెకు సముచిత స్దానమే ఇచ్చారు జగన్‌. అందుకు తగ్గట్టు సునీత కూడా చంద్రబాబును అవసరం ఉన్నా లేకపోయినా గట్టిగానే టార్గెట్‌ చేశారన్నది రాజకీయ పరిశీలకుల మాట. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా ఆమె వైసీపీకి రాజీనామా చేయటం చర్చనీయాంశమైంది. ఇక ఇదే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీమంత్రి శిద్దా రాఘవరావు కూడా ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన శిద్దా రాఘవరావు కూడా 2019 ఓటమి తర్వాత టీడీపీని వదిలి వైసీపీలో చేరిపోయారు.

తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు సిద్దా. ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలో చేరకపోయిన్పటికీ టీడీపీ వైపునకే అడుగులు పడుతున్నాయని, రీ ఎంట్రీ కోసం నానా తంటాలు పడుతున్నారన్నది ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్‌. మరోవైపు జిల్లాలో పార్టీకి ఆయువుపట్టులాంటి వాడని చెప్పుకునే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీని వదివేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో ఇలాంటి ప్రచారం జరిగినా… ఖండించారు బాలినేని. కానీ… ఈసారి అలాంటిది ఉండబోదన్న టాక్‌ నడుస్తోంది. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లేదన్న అసంతృప్తితో ఉన్నారట బాలినేని. పెద్దోళ్ళకి దీని గురించి చెబుదామంటే… కనీసం తన మాట వినే పరిస్థితుల్లో అధిష్టానం లేదని కూడా అసహనంతో ఉన్నట్టు తెలిసింది. పైగా తాను జనసేనలోకి వెళ్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని.. బహుశా తాను వెళ్ళకుండా అడ్డుకునేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్న మాజీ మంత్రి వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయవర్గాల్లో. ఆ వ్యాఖ్యలతో ఆయన పార్టీ మార్పు ప్రచారానికి మరింత బలం చేకూరినట్లుగా భావిస్తున్నారు కొందరు. వీరితో పాటు గత ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన యడం బాలాజీ, అద్దంకిలో ఓడిన పాణెం చిన హనిమిరెడ్డిలు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు.. సంతనూతలపాడు నుంచి పోటీ చేసి ఓడిన మాజీమంత్రి మేరుగు నాగార్జున కేవలం పార్టీ సెంట్రల్ ఆఫీస్ కే పరిమితం అయ్యారు తప్ప నియోజకవర్గంలోని కార్యకర్తలకు టచ్ లో లేరట. అసలు నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లు ఎక్కుడున్నారో ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదట. ఈ పరిస్థితుల్లో ప్రకాశం వైసీపీలో అంధకారం అలముకుంటోందని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. మరి ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీకి గుడ్‌బై చెప్పే వాళ్ళ లిస్ట్‌లో ఇంకే పేర్లు ఉన్నాయో చూడాలంటున్నారు పరిశీలకులు.