NTV Telugu Site icon

Off The Record : వరుసగా ఎఫైర్స్లో చిక్కుకుంటున్న వైసీపీ నేతలు

Ysrcp Otr

Ysrcp Otr

అగ్రనేతల ఎఫైర్స్ వైసీపీకి తలపోటుగా మారుతున్నాయా? ఒకరు కాదు… ఇద్దరు కాదు… వరుసబెట్టి కీలక నేతలంతా ఎఫైర్స్ ఎపిసోడ్స్‌లో చిక్కుకోవడం పార్టీ కేడర్‌ని సైతం ఇరుకున పెడుతోందా? వీళ్ళ చేష్టలతో బయట తలెత్తుకోలేకపోతున్నామని కేడర్‌ తలలు పట్టుకుంటోందా? నాయకులంటే అవినీతి, అక్రమాల ఆరోపణలు రావడం సహజం కానీ ఇక్కడ వస్తున్నవన్నీ పరువు తక్కువ విషయాలు కావడం అగ్ర నాయకత్వానికి కూడా చికాకుగా మారిందా? ఈ ఎపిసోడ్ లో ఎవర్ని ఏం అనాలో తెలియక వైసీపీ పెద్దలు సైలెంట్‌గా ఉన్నారా? వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరుగా ఎఫైర్స్ ఎపిసోడ్‌లో చిక్కుకుంటున్నారు. ఈ నేతల ఆడియో, వీడియో ఫైల్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ పార్టీ పరువు తీస్తున్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది వైసీపీ వర్గాల్లో. పార్టీ అధికారంలో ఉండగా అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఆయన ఎవరో మహిళతో ప్రైవేట్ సంభాషణ సాగించిన వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. మంత్రిగా ఉండీ… ఇలా చేయడం ఏంటని నాడు వాపోయారు పార్టీ నేతలంతా. ఆ ఎపిసోడ్ ఎలాగోలా ముగిసిందనుకుంటుండగానే అవంతి తర్వాత మంత్రి అయిన అంబటి రాంబాబు ఆడియో కూడా అంతకు మించి సంచలనమైంది. అందులోనూ అంతే…. గంటా… అరగంటా… వంటి సంభాషణల్ని అందరూ విన్నారు. ఆ వ్యవహారం బాగా రచ్చ అవడంతో… తన మీద కుట్ర జరగిందని, ఈ కుట్రలో ఎవరు ఉన్నారో తేల్చాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. వీళ్ళిద్దరి తర్వాత కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన మీద జనసేన కూడా ఇలాంటి ఆరోపణే చేస్తోంది. ద్వారంపూడికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందనేది ఆ ఆరోపణ. ఆ మహిళకు మాజీ ఎమ్మెల్యే అన్యాయం చేయాలని చూస్తున్నాడంటున్న జనసేన ఆమెకు అండగా ఉంటామని కూడా చెబుతోంది. వైసీపీ పరంగా ఈయనా ముఖ్య నేతే. అప్పట్లో పవన్ కల్యాణ్ మీద ఒంటికాలితో లేచి…. దమ్ముంటే కాకినాడ సిటీలో తన మీద పోటీకి రావాలని సవాళ్లు విసిరి ఫేమస్ అయిన నాయకుడే. అందుకే ఈయన మీద జనసేన చేసిన ఆరోపణలు కూడా వైరల్ అయ్యాయి.

ఇక మరో నేత హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఇక ఈయన గారి వీడియో ఒకటి అప్పట్లో మామూలు దుమారం రేపలేదు. అది ఎ సర్టిఫికెట్‌ కూడా కాదు… అంతకు మించి ఎ ప్లస్‌ ప్లస్‌ అనేది ఏదన్నా ఉంటే… ఈ మాజీ ఎంపీ నాడి వీడియోకు ఇవ్వ వచ్చన్న కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వెల్లువెత్తాయి. ఆ విషయం కూడా పార్టీకి సమస్య తెచ్చింది. ఇదీ వైసీపీ లీడర్ల ఎఫైర్స్ బ్యాక్ గ్రౌండ్. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శీను ఎఫైర్ ఎపిసోడ్‌ సూపర్‌ హిట్‌ టీవీ సీరియల్‌ను మించిన ట్విస్ట్‌లతో నడుస్తోంది. నాలుగు రోజుల నుంచి నడుస్తున్న దువ్వాడ దంపుడు సీరియల్‌ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏదో చిన్నా చితకా నాయకుడు ఇలాంటివి చేస్తే ఎవరూ పట్టించుకునే వాళ్లు కాకపోవచ్చు. కానీ.. ఏకంగా అచ్చెన్నాయుడు మీద సవాళ్లు విసిరి, చంద్రబాబును తిట్టి, పవన్ కల్యాణ్‌ మీద ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డ నాయకుడు దువ్వాడ కావడంతోనే దీనికి అంత గిరాకీ పెరిగిందని అంటున్నారు. దువ్వాడ శీనుపై ఆయన భార్య వాణి ఆరోపణలు… వాటికి దువ్వాడతో పాటు ఆయనకు అతి దగ్గరి మనిషినంటున్న దివ్వెల మాధవి కౌంటర్లతో మీడియాలో మోత మోగిపోతోంది. వాస్తవానికి ఇది వ్యక్తిగత విషయమే అయినా…. దువ్వాడ శీను ఎమ్మెల్సీగా ఉండటం, ఆయన భార్య జడ్పీటీసీ కావడం, దివ్వెల మాధవి కూడా వైసీపీ నాయకురాలే అవడంతో ఈ ఎపిసోడ్‌ మొత్తం తిరిగి తిరిగి పార్టీని చుట్టుకుంటోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇది పార్టీ కేడర్‌కు తలనొప్పిగా మారిందట. వేరే వేరే గొడవలైతే అది ఎవరికి సంబంధించిందో వాళ్లే చూసుకునే వాళ్లు… ఇలాంటి ఎఫైర్లలో నాయకులు చిక్కుకుంటే అది కేడర్ కు కూడా అంటుకుంటుందని… తలెత్తుకునే పరిస్థితి ఉండదని వాపోతున్నట్టు తెలిసింది. ఇంత జరగుతున్నా వైసీపీ హైకమాండ్ జోక్యం చేసుకోకపోవడానికి కారణం ఏంటో కూడా తెలియడం లేదట ఇతర నేతలకు.

 

కనీసం ఈ వ్యవహారాన్ని త్వరగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుని మీడియాకు ఎక్కడం మానుకోమని కూడా పార్టీ సలహానో… సూచనో ఇవ్వకపోవడం ఏంటనే వాదనా ఉంది. అయితే గతంలో బయటపడ్డ ఆడియో, వీడియోల విషయంలో వైసీపీ నాయకత్వం జోక్యం చేసుకోలేదు. కానీసం వాళ్లని పిలిచి మందలించనూ లేదు. దీంతో ఇప్పుడు దువ్వాడను ఏ విధంగా కంట్రోల్ చేయగలం? ఆయనకు ఏం సలహా ఇవ్వగలం అని అంటున్నారట కొందరు. అలాగని వదిలేస్తే… ఇది సమస్యగా మారుతోందని, అసలా పార్టీనే అంత, మొత్తం పార్టీనే ఇలాంటి ఎఫైర్స్ లో పడిపోయిందనేలా జరుగుతున్న ప్రచారం మహిళల్లోకి వెళ్తే మరింత నష్టపోతామని కేడర్ గగ్గోలు పెడుతోందట. సరికొత్త మలుపులుతో… రోజుకో రకంగా టర్న్‌ అవుతూ….డైలీ సీరియల్‌ని మించి సాగుతున్న దువ్వాడ కథాచిత్రం కేడర్ కు చికాకు తెప్పిస్తోందంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీ మీద పడుతున్న ఎ సర్టిఫికెట్‌ ఇమేజ్‌ను పోగొట్టడానికి వైసీపీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.

Show comments