నిన్న మాధవ్.. నేడు యాదవ్… సీఐ రూట్‌లోనే ఎస్సై కూడా ఖాకీ వదిలేసి ఖద్దర్ తొడగాలనుకుంటున్నారా? వైసీపీ అధ్యక్షుడు జగన్ మీద ఎస్సై సుధాకర్ యాదవ్ డైరెక్ట్ అటాక్‌కి… బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గట్టిగానే వినిపిస్తోందా? ఆయనకు రాజకీయ ఉద్దేశ్యాలున్నాయని వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? అసలు సుధాకర్ యాదవ్ విషయంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎన్ని రోజులని ఇలా… ఖద్దరు చెప్పినట్టు వింటాం…… వాళ్ళకు సలాం కొడతాం…. ఆ ఖద్దరేదో మనమే వేసుకుంటే పోలా? రూలింగ్‌లోకి వస్తే… ఆ సెల్యూట్‌లేవో మనకే దక్కుతాయి కదా అని ఆలోచించే పోలీసుల సంఖ్య ఏపీలో పెరుగుతోందా అన్న డౌట్స్ వస్తున్నాయట ఇప్పుడు ఎక్కువ మందికి. సీజన్ కాని సీజన్‌లో ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు వస్తోందని అంటే… రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుంటున్నారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక టైంలో ఎస్ ఐ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలు రావడం, ఆ తర్వాత ఆయనపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. అది అక్కడితో ఆగితే ఒక లెక్క. కానీ… జగన్‌కు కౌంటర్ వేసే క్రమంలో ఎస్సై సుధాకర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. నువ్వు తీసేయడానికి పోలీస్ యూనిఫామ్ ఏమీ అరటి తొక్క కాదంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు ఎస్సై. హత్యకు గురైన పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ పాపిరెడ్డిపల్లికి వచ్చినప్పుడు పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సుధాకర్ యాదవ్ వైసీపీ నేతలపై పెట్టిన కేసులను ప్రత్యేకంగా ప్రస్తావించారు జగన్. అక్కడ సీన్ కట్ చేస్తే… వైసీపీ అధ్యక్షుడిని సింగిలర్‌లో సంభోధిస్తూ… పోలీస్ యూనిఫామ్ ఏమైనా అరటి తొక్కనుకున్నావా నువ్వు తీయడానికి అంటూ సీరియస్‌గా మాట్లాడారు సుధాకర్ యాదవ్. దీనికి వ్తెసీపీ నుంచి కూడా కౌంటర్స్ పడ్డాయి. వాస్తవంగా సుధాకర్ యాదవ్ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించారన్నది మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ప్రధానమైన ఆరోపణ. గతంలో ఆయన గుంతకల్ ఎస్సైగా పనిచేశారని, యాదవ సామాజిక వర్గంతోపాటు బీసీలు తనవైపు ఉన్నారన్న ఉద్దేశంతో గుంతకల్లు టికెట్ ఆశించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్య కుమార్ యాదవ్‌తో పాటు ఇతర నాయకులను కలిసిన ఫోటోలు కూడా ప్రదర్శించారు ప్రకాష్ రెడ్డి.
ఎస్సై తెలుగుదేశం పార్టీకి ఏ స్థాయి మద్దతుదారుడో ఇదే ఉదాహరణ అన్నారాయన. దీంతో సుధాకర్ యాదవ్ నిజంగానే రాజకీయాల వైపు చూస్తున్నారా అన్న చర్చ జిల్లాలో హాట్ టాపిక్ అయింది. పొలిటికల్ ఇంట్రస్ట్‌తోనే ఎస్సై అలా ఘాటుగా రియాక్ట్ అయ్యారా? అంటూ ఆరా తీసేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. అదే సమయంలో మాజీ సీఐ గోరంట్ల మాధవ్‌ని గుర్తుకు తెచ్చుకుంటూ ఏమో… గుర్రం ఎగరావచ్చు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఒకప్పుడు సీఐ.2019 ఎన్నికల్లో ఖాకీ తీసి ఖద్దర్ వేసి నేరుగా హిందూపురం పార్లమెంటు సీటుకు పోటీ చేసి గెలిచారు. అంతకు ముందు ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాటిమీద నాటి సీఐ మాధవ్ సీరియస్ అయ్యారు. పోలీసులంటే అటు ఇటు కాని వారు అనుకుంటున్నారా.. మగాళ్ళు అంటూ మీసం మెలేసి చెప్పారు. జేసీ మీదికే మీసం తిప్పడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. అదే నేమ్ అండ్ ఫేమ్‌తో రాజకీయాల్లోకి వచ్చిన మాధవ్… వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత న్యూడ్ వీడియోతో పాటు రకరకాల వివాదాల్లో ఇరుక్కుని రాజకీయంగా కొంత పతనమైనా..తిరిగి తేరుకునే ప్రయత్నంలో ఉన్నారాయన. అదంతా చూసిన వాళ్ళు….ఇప్పుడు సుధాకర్ యాదవ్ కూడా జగన్ మీద చేసిన వ్యాఖ్యల్ని పోల్చుకుంటూ…. ఈయన కూడా పొలిటికల్ రూట్‌లో వెళ్తున్నారా అని మాట్లాడుకుంటున్నారట. మరోవైపు సుధాకర్‌యాదవ్ టీడీపీ లీడర్స్‌తో కలిసి ఉన్న ఫోటోలను వైసీపీ వైరల్ చేస్తోంది. ఇలాంటి అధికారి నిజాయితీగా ఎలా పనిచేస్తారు… ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఆరోపిస్తున్నారు ఫ్యాన్ లీడర్స్. వైసీపీ అధ్యక్షుడిని ఏకవచనంతో సంబోధించిన సుధాకర్ యాదవ్ మాత్రం రాజకీయ విమర్శలపై మాత్రం ఎక్కడా స్పందించలేదు. భవిష్యత్‌లో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.