NTV Telugu Site icon

YS Jagan : వైఎస్‌ 2.0లో ఊహించని అంశాలు? ఓటమి తర్వాత జగన్ మారిపోయారా?

Ysrcp

Ysrcp

జగన్‌ 2.oలో ఊహించని అంశాలు ఉండబోతున్నాయా? ఓటమి తర్వాత ఆయన బాగా మారిపోయారా? అందుకే ఇప్పుడు గతానికి పూర్తి భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఏంటా నిర్ణయాలు? వాటి ప్రభావం ఎంతవరకు ఉండవచ్చంటున్నారు? వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఓటు బ్యాంక్ దాదాపుగా ఆ పార్టీకి టర్న్ అయ్యింది. 95 శాతం దాకా కాంగ్రెస్ ఓటర్లను తన వైపునకు తిప్పుకోవటంలో సక్సెస్ అయిన జగన్… కొందరు కీలక నేతల విషయంలో మాత్రం లైట్‌గా ఉన్నారట. అప్పట్లోనే వాళ్ళు వైసీపీకి వస్తామన్నా సమాధానం చెప్పలేదని, వాళ్ళకు బదులు తానే కొత్త వాళ్ళని తయారు చేయాలని డిసైడ్ అయినట్టు చెప్పుకున్నారు. అయితే కొత్తగా వచ్చిన వారిలో పూర్తి స్థాయిలో సక్సెస్ అవనివాళ్ళు కొందరైతే…. అవసరానికి పార్టీని వాడుకుని తర్వాత వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మరికొందరు. దీంతో ఈసారి ఓటమి తర్వాత జగన్‌ ప్లాన్‌ మారినట్టు ప్రచారం మొజలైంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కీలక నేతలపై ప్రస్తుతం జగన్‌ దృష్టి సారించినట్లు సమాచారం. కొందరికి రెడ్‌ కార్పెట్‌ వేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగానే కాంగ్రెస్ మాజీమంత్రి శైలజానాథ్‌ను తీసుకున్నారట. మరి కొందరు కాంగ్రెస్‌ సీనియర్స్‌ కూడా తనలాగే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని శైలజానాథ్‌ చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ మనుగడ ఇక కష్టం అనే భావన ఉంది రాజకీయ వర్గాల్లో. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఉంటే కూటమిలో ఉండాలి.. లేకుంటే వైసీపీలో చేరాలి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నట్టుగా నడుస్తోంది రాజకీయం. ఇలాంటి వాతావరణంలో వైసీపీ ఫోకస్‌ మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే… కార్యకర్తల విషయంలో ఇక నుంచి 2.0 చూస్తారంటూ కాస్త తగ్గినట్టు కనిపించారు జగన్‌. ఈ మార్పు చేరికల విషయంలో కూడా ఉంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.

ఓ వైపు పార్టీ ఓటమి.. కీలక నేతలు వీడుతున్న సమయంలో గత అనుభవాలతో తన రాజకీయ వ్యూహాలను మార్చాలనుకుంటున్నారట జగన్‌. అందులో భాగంగానే నాడు రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలతో రాయబారాలు మొదలుపెట్టినట్టు సమాచారం. వాళ్ళని తానే స్వయంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట.మాజీ మంత్రి శైలజానాథ్ చేరికకు అదే కారణం అంటున్నారు. ఇక తాజాగా సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఉండవల్లి. రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించటంతో నాడు కాంగ్రెస్ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారాయన. ప్రస్తుతం వైసీపీలోకి రావాలంటూ ఆ పార్టీ ముఖ్య నేతలు ఉండవల్లిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వైఎస్ సన్నిహితుడుగా పేరున్న ఉండవల్లి రాకతో పార్టీకి మంచి వాయిస్ ఉంటుందని భావిస్తున్నారట. ఆయనతో పాటు పీసీసీ మాజీ చీఫ్‌ రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ హర్ష కుమార్, మరో మాజీ ఎంపీ పళ్ళంరాజుతో వైసీపీ ముఖ్యులు టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే తులసిరెడ్డి, సుంకర పద్మశ్రీ వంటి నేతలు కూడా లిస్ట్‌లో ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రఘువీరారెడ్డి బీసీ నేత. వైఎస్ కు సన్నిహితుడిగా పేరున్న రఘువీరా… గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. అలాగే జగన్ పై ఎలాంటి వ్యతిరేకత లేని వ్యక్తిగా పేరుంది. ఇక కాకినాడ మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు కూడా ఎప్పుడూ ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయలేదన్న పేరుంది. పళ్ళంరాజు ఇప్పుడు పార్టీకి ప్లస్‌ అవుతారని భావిస్తోందట వైసీపీ అధిష్టానం. కీలక నేతల నిష్క్రమణలతో కాస్త స్తబ్దుగా మారిన పార్టీలోకి సీనియర్స్‌ రాకతో యాక్టివ్‌ అవుతుందని ఫ్యాన్‌ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… కాస్త ఆలస్యం కావచ్చుగానీ… వాళ్ళలో కొందరైనా రావడం మాత్రం పక్కా అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఈ కొత్త వ్యూహం వైసీపీకి ఎంతవరకు కలిసొస్తుంది? తిరిగి రీ ఛార్జ్‌ మోడ్‌లోకి వచ్చేస్తుందా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.