NTV Telugu Site icon

Off The Record : అబ్బయ్య చౌదరిని కేసుల భయాలు వెంటాడుతున్నాయా..?

Ysrcp

Ysrcp

అక్కడ మొన్నటిదాకా కాలర్ ఎగరేసుకు తిరిగిన వైసిపి నాయకులు, కార్యకర్తలు ఇపుడు కన్ఫ్యూజన్లో పడ్డారా? ఆయన అండ చూసుకుని విచ్చలవిడిగా చెలరేగిపోయి తప్పు చేశామా అంటూ… ఇప్పుడు ఫీలవుతున్నారా? ఓడిపోయాక చాప చుట్టేసిన లీడర్‌ తమను నిండా ముంచేశారంటూ తెగ ఫీలైపోతున్నారా? కేడర్‌లో కాన్ఫిడెన్స్‌కంటే నా యాపారమే నాకు ముఖ్యమని అంటున్న ఆ నాయకుడెవరు? ఏదా అసెంబ్లీ నియోజకవర్గం? దెందులూరు.. పొలిటికల్‌ హైడ్రామాలు, హై టెన్షన్స్‌కి కేరాఫ్. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇక్కడి రాజకీయం ప్రత్యేకమే. 2019 ఎన్నికల్లో దెందులూరు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు అబ్బయ్య చౌదరి. అప్పట్లో ఉన్న జగన్ మేనియాతోపాటు కాలం కలిసొచ్చి టీడీపీ కంచుకోటలో పాగా వేయగలిగారని చెప్పుకుంటారు. ఇక అప్పట్నుంచి నియోజకవర్గంలో సీన్‌ మారిపోయింది. ఎప్పుడూ ఏదో ఒక పొలిటికల్‌ టెన్షన్‌ నడుస్తూనే ఉండేదన్నది లోకల్‌ టాక్‌. అలాగే మాజీ ఎమ్మెల్యే చింతమనేని వర్గాన్ని ఏదో ఒక రూపంలో ఇరికించడమే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు సైతం వచ్చాయి. అటు చింతమనేని ప్రభాకర్‌ మీద కేసుల చిట్టా కూడా సెంచరీ కొట్టింది. అసలు… నియోజకవర్గంలో టిడిపి మూలాలు లేకండా చేసి దెందులూరును వైసిపి అడ్డాగా మార్చడమే టార్గెట్‌గా పెట్టుకున్నారంటూ అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న అబ్బయ్య చౌదరిని విమర్శించాయి పసుపు వర్గాలు. కట్ చేస్తే… 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామనుకున్న దెందులూరులో సైతం బోర్లా పడింది వైసీపీ.

అదంతా ఒక ఎత్తయితే…. ఓడిపోయాక నియోజకవర్గానికి గెస్ట్‌ ఆర్టిస్ట్‌ అయ్యారట అబ్బయ్య చౌదరి. లండన్‌లో ఎక్కువగా ఉంటూ తన వ్యాపారాలు చక్కబెట్టే పనిలో బిజీ అయిపోయినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో ఇప్పుడు స్థానిక వైసీపీ కేడర్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అంటున్నారు. అప్పట్లో నానా హంగామా చేసిన కొందరికి ఇప్పుడు లోకల్‌ టీడీపీ నాయకులు టార్గెట్ చేసి మరీ రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో నియోజకవర్గ వైసీపీ నేతలు కొందరి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయట. అప్పట్లో అబ్బయ్య చౌదరిని చూసుకుని రెచ్చిపోయామని, ఇప్పుడు అట్నుంచి లెక్క సరిచేసే పని మొదలైతే… ఏమైపోతామోనంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట సదరు లీడర్స్‌. మరోవైపు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య ఇంటి ముందు కొల్లేరు గ్రామాల ప్రజలు తమకు బాకీ పడిన డబ్బులు చెల్లించాలంటూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మీద కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్న అనుమానాలు పెరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఏలూరు జిల్లా పార్టీ ఆత్మీయ సమావేశంలో జిల్లా నేతలు, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరితో పాటు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నాయి. మాజీ మంత్రులు, అయా నియోజకవర్గ ఇంచార్జిలు ఇచ్చిన భరోసాతో… మిగతా సెగ్మెంట్స్‌ కేడర్‌, లీడర్స్‌లో జోష్ పెరిగినా.. దెందులూరు కార్యకర్తల్ని మాత్రం నిరుత్సాహం ఆవహించిందట. అసలు తమ నియోజకవర్గం నుంచి అక్కడ పైస్థాయి ప్రాతినిధ్యం లేకపోవడంతో కేడర్‌లో కంగాళీ రెట్టింపైనట్టు చెప్పుకుంటున్నారు. కేడర్‌కు ప్రతి ఒక్క ఇంఛార్జ్‌ అందుబాటులో ఉండాలి, కనీసం ఫోన్‌కైనా స్పందించాలంటూ… పార్టీ పెద్దలు గట్టిగానే చెప్పినా… అసలు మా ఫోన్‌ తీసేది ఎవరంటూ దెందులూరు కార్యకర్తలు సణుక్కున్నారట. అయితే దెందులూరు మాజీ ఎమ్మెల్యే యాక్టివ్‌గా లేకపోవడానికి కారణాలు కూడా గట్టిగానే ఉన్నాయని అంటున్నారు కొందరు. పొలిటికల్‌ బూమరాంగ్‌తోనే ఇప్పుడాయన ఆచితూచి అడుగులు వేస్తున్నారన్న టాక్‌ నడుస్తోంది. ఇప్పుడు యాక్టివ్‌ అయి కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో ఇబ్బందవుతుందన్న ఆలోచనతో వెనక్కి తగ్గినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే అదునుగా టిడిపిలోని ఒక వర్గం… అసలు అబ్బయ్యను సైకిలెక్కించేస్తే పోలా అంటూ ఆలోచిస్తోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు వ్యతిరేకంగా పనిచేసిన ఆయన సొంత సామాజికవర్గ నాయకులు కొందరు ఇపుడు మాజీ ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకువస్తే…..మన వర్గం బలపడుతుంది కదా అని ఆలోచిస్తున్నట్టు సమాచారం. రాజకీయాల్లో ఎప్పుడూ ఏదీ ఒకేవైపు ఉండదన్న వాస్తవాన్ని గ్రహించకుండా నాడు చెలరేగిపోవడంవల్లే…ఇప్పుడు అబ్బయ్య చౌదరికి తిప్పలు తప్పడం లేదన్నది విస్తృత అభిప్రాయం. ఆయన వైఖరివల్లే ఇప్పుడు కేడర్‌ సైతం దిక్కులేకుండా బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని అంటున్నారు. అసలే.. అది దెందులూరు. ఆపైన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని. ఈ పరిస్థితుల్లో మరో నాలుగేళ్లు ఎలా నెట్టుకు రావాలన్నది లోకల్‌ వైసీపీ కేడర్‌ ఆందోళన అట. పార్టీ పెద్దలు వాళ్ళకి ఎంతవరకు భరోసా ఇస్తారో చూడాలి.