Site icon NTV Telugu

Off The Record : వరంగల్‌ కాంగ్రెస్‌ లో మంత్రులను సైతం ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదా? ఎందుకు?

Warangal Congress

Warangal Congress

అక్కడ ఎమ్మెల్యేలంతా…………. మంత్రులా, అయితే ఏంటని అంటున్నారా? జానేదేవ్‌, వాళ్ళదారి వాళ్ళది, మా దారి మాదని అంటూ ఏకంగా చేతల్లోనే చూపిస్తున్నారా? అంతా దరిదాపుల్లో ఉన్నాసరే… కలిసి కార్యక్రమాల్లో పాల్గొనలేనంత గ్యాప్‌ పెరిగిపోయిందా? ఎక్కడుందా దారుణమైన పరిస్థితి? ఎవరా ఇద్దరు మంత్రులు? ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో ఎవరి గోల వారిదే అన్నట్టుగా మారుతోంది. మరీ ముఖ్యంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు అస్సలు పొసగడం లేదంటున్నారు. వీళ్ళ వాలకం చూస్తుంటే… కాంగ్రెస్‌లో ఐక్యత అన్నది భ్రమేనని తేలిపోతోందంటున్నారు పరిశీలకులు. మంత్రులు, ఎమ్మెల్యేలు నాలుగైదు కిలోమీటర్ల పరిధిలోనే తిరుగుతున్నా…. ఎవరి కార్యక్రమాలు వారివే అన్నట్టుగా నిర్వహిస్తున్నారట. వారం రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, పాల్గొంటున్న నాయకుల తీరు చూస్తుంటే….అసలు వీళ్ళంతా ఒకే పార్టీలోనే ఉన్నారా? అన్న అనుమానం కలుగుతోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. జిల్లాకు మంత్రి అయినా…. అంబేద్కర్ జయంతి వేడుకల్లో కొండా సురేఖ కేవలం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు. అధికారికంగా అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన వేడుకలకు వెళ్ళలేదు. ఎమ్మెల్యేలంతా పాల్గొన్న ఆ ప్రోగ్రామ్‌కు మంత్రి వెళ్ళకపోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది. ఇక అంతకుముందు శుక్రవారం జరిగిన బాబూ జగజ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో కూడా ఇలాగే గ్యాప్‌ కనిపించింది. ఇక నగరంలో నిర్వహించిన తూర్పు నియోజకవర్గ స్థాయి జాబ్ మేళాలో మంత్రులు సురేఖ, సీతక్క పాల్గొన్నారు.

కానీ… ఆ వేదికకు కిలోమీటర్ పరిధిలోనే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నిర్వహించిన పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఇద్దరు మంత్రులు వెళ్ళలేదు. అధికారిక కార్యక్రమం అయినా సరే… అలా ఎందుకు జరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు అంతా. మంత్రులకు ఆహ్వానం లేదా? లేక పిలిచినా వెళ్లలేదా? అని ఆరాలు తీస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్యలాంటి చాలా మంది నాయకులు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైతే… సమీపంలోనే ఉండి కూడా మంత్రులు ఇద్దరూ అటువైపు తొంగి చూడకపోవడం ఏంటన్నది ప్రస్తుతానికి క్వశ్చన్‌ మార్క్‌గా మిగిలింది. అంతేకాదు….పాలిటెక్నిక్ కాలేజీ భవనాల శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న ప్రాంతాన్ని దాటుకుంటూనే వెళ్ళి కొండా సురేఖ నిర్వహించిన మెగా జాబ్‌ మేళాలో పాల్గొన్నారు మరో మంత్రి సీతక్క. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఒకే చోట ఉండి కూడా.. ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించటం ఏంటన్నది అంతు చిక్కడం లేదంటున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు. అసలేంటీ గోల? ఎందుకీ గ్యాప్‌ అని ఆరా తీస్తున్న వారికి ఇప్పుడిప్పుడే కొత్త విషయాలు తెలుస్తున్నాయట. మంత్రి సీతక్క మీద ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆమె హనుమకొండ కలెక్టరేట్‌లో తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్‌కు నర్సంపేట, వరంగల్‌ పశ్చిమ, మహబూబాబాద్‌, పాలకుర్తి ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దీంతో వరంగల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సయోధ్య లేదన్న గుసగుసలు గుప్పుమంటున్నాయి. మొన్నటి వరకు సీతక్క, సురేఖల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయన్న ప్రచారానికి ఈ ఇద్దరు మంత్రులు తెర దించే ప్రయత్నం చేశారు.

మినీ మేడారం జాతరలో ఇద్దరు మంత్రులు పాల్గొన్నారు. సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న మేడారం ప్రాంతంలో జరిగిన కార్యక్రమానికి సురేఖ హాజరైతే తాజాగా సురేఖ ప్రాతినిధ్య వాయిస్తున్న ఈస్ట్ నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాకు సీతక్క వెళ్ళి ఐక్యతారాగం పలికారు. బస్‌…. అది అక్కడి వరకే. కేవలం మంత్రులు మాత్రమే మా మధ్య గ్యాప్‌ లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారుగానీ…. ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలను దాచలేకపోయారన్న టాక్‌ నడుస్తోంది జిల్లాలో. దీని ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై తీవ్రంగా పడుతుందనే చర్చ నడుస్తోంది ప్రస్తుతం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు క్యాడర్‌కి నామినేటెడ్ పదవులు లేవు. నేతల మధ్య సఖ్యత లేకపోవడమే అందుకు ప్రధాన కారణం అంటున్నారు. ఒకరు సూచించిన పేరును మరొకరు వ్యతిరేకిస్తుండటంతో… నామినేటెడ్ పోస్టులు క్యాడర్‌ని ఊరిస్తున్నాయే తప్పచేతికి అందటం లేదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విభేదాలకు ఎక్కడ ఫుల్‌ స్టాప్‌ పడుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు.

Exit mobile version