NTV Telugu Site icon

Off The Record: తుంగతుర్తి కాంగ్రెస్‌లో లుకలుకలు.. కేడర్‌కు చుక్కలు చూపిస్తున్న ఎమ్మెల్యే మందుల సామేలు

Otr Congress

Otr Congress

Off The Record: కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆ నియోజకవర్గం కేరాఫ్‌గా మారింది! దగ్గరుండి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తగినశాస్తే జరిగిందని ఒక బ్యాచ్‌ ఆవేదన వ్యక్తం చేస్తోంది! వలస వచ్చిన వారికే ప్రియారిటీ ఇస్తున్నారని.. పాత వాళ్లను పాతరేశారని భగ్గున మండుతున్నారు. ఇంతకూ కొత్త, పాత నేతలుగా వారంతా ఎందుకు విడిపోయారు? సీనియర్లను పక్కన పడేసిన ఆ ఎమ్మెల్యే ఎవరు?

తుంగతుర్తి కాంగ్రెస్‌లో గ్రూప్‌ పాలిటిక్స్ పరాకాష్టకు చేరాయి. ఎందాకా అంటే, సొంతపార్టీ నేతలనే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించేంత వరకు! కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న కేడర్‌ ఒక్కసారిగా రోడ్డెక్కింది! దీనిక్కారణం ఎమ్మెల్యే మందుల సామేలే అని ఒక వర్గం బలంగా వాదిస్తోంది! అసెంబ్లీ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన సామేల్‌కు.. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, తుంగతుర్తి నియోజకవర్గం కేడర్‌ రెడ్ కార్పెట్ పరిచిన మాట వాస్తవమే. టికెట్ ఇప్పించడం దగ్గర్నుంచి ప్రచారం, ఆర్ధిక సహాయం.. ఇలా అన్నీ తామై ముందుకు నడిపించామని నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాట! తీరా గెలిచిన తర్వాత, సాయంచేసిన కాంగ్రెస్ లీడర్లను కాదని, బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన నేతలను చేరదీశారని, ఎమ్మెల్యే వాళ్ల పక్షాన్నే ఉంటున్నారని కాంగ్రెస్ నేతలు కొంతకాలంగా లోలోపల మథనపడ్డారు. పదేళ్లు పార్టీకి అండగా నిలబడిన నేతలను పూచికపుల్లలాగా తీసి పడేశారని… పార్టీ అధికారంలో ఉన్నా ప్రాధాన్యత లేకుండా పోయిందని కేడర్ గుర్రుమీదుంది. దీనికి తోడు పార్టీ కార్యకలాపాల్లో, అధికారిక వ్యవహారాల్లో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల జోక్యం మితిమీరి పోయిందనే అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోంది.

దశాబ్దం పాటు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం నిలబడితే, అండగా ఉన్న నేతలను పక్కనపెట్టి తన అనుకున్న వాళ్లతో నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలు చక్కబెట్టడం కూడా లోకల్ లీడర్ల ఆగ్రహానికి కారణంగా మారిందట. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడిసరికి.. తుంగతుర్తి కాంగ్రెస్ పాత కేడర్ బరస్టయింది. దగా పడిన కాంగ్రెస్ నేతల్లారా కదలిరండి అంటూ ప్రత్యేక సమావేశానికి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానంద చారి పిలుపునిచ్చారు. అయితే ఈ మీటింగ్‌కి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ వాళ్లు సమావేశం పెట్టాలనే తీర్మానించుకున్నారు. పోలీసులు ససేమిరా అన్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్టుల వరకు వెళ్లింది. స్టేషన్ ముందు ధర్నా జరిగింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మందుల సామేలు ఆదేశాల ప్రకారమే అరెస్టులు జరిగాయని.. సొంతపార్టీ నేతలనే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించారని రెబల్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత దారుణం లేదని.. సొంతపార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా విడిపోవాల్సి వచ్చిందని ఆ వర్గం నేతలు చర్చించుకుంటున్నారు.

ఎమ్మెల్యే మందుల సామేలు తీరుపై ఇకనైనా హైకమాండ్ దృష్టి సారించాలని పాత కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. పరిస్థితి చక్కదిద్దకపోతే తమ ఫ్యూచర్‌ తాము చూసుకుంటామని అల్టమేటం ఇస్తున్నారు. దసరా తర్వాత తాడోపేడో గాంధీభవన్‌లోనే తేల్చుకుంటామని చెబుతున్నారు. కాంగ్రెస్‌ కంచుకోటగా మారిన ఉమ్మడి నల్గొండలో ఒక సెగ్మెంట్ సైడ్‌ ఎఫెక్టులతో పక్కదారి పడుతుంటే.. సీనియర్ నేతలు జోక్యం చేసుకుని వివాదాలను సెట్ చేస్తారా.. లేక కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు ఆజ్యం పోస్తారా? వెయిట్ అండ్ సీ!

 

Show comments