తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్, బీజేపీ క్లారిటీకి రాలేకపోతున్నాయా? ఆశావహులు పెద్ద ఎత్తున ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నా… అధిష్టానాల వైపు నుంచి ఎందుకు స్పందన లేదు? లెక్కలు పక్కాగా కుదరడం లేదా? లేక అంతకు మించిన సమస్యలు వేరే ఉన్నాయా? అవసరానికి మించిన డిమాండే ఆలస్యానికి కారణం అవుతోందా? లేక అవతలి వాళ్ళని చూసి మనం అభ్యర్థుల్ని ప్రకటిద్దామన్న వైఖరి ఉందా? వచ్చే మార్చిలో ఖాళీ అవబోతున్న ఎమ్మెల్సీ స్థానాల విషయమై తెలంగాణలో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ సీట్లను కైవసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్‌లో చాలా మంది ఎమ్మెల్సీ సీటుపై ఆశతో ఉన్నారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. ఈ సారి ఆయన బరిలో ఉండే అవకాశం లేదంటున్నారు. అందుకే కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం. అలాగే ఖమ్మం, నల్లగొండ , వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ సీటు కూడా ఖాళీ అవుతోంది. దీంతో ఆయా జిల్లాల్లో పార్టీకి ఉన్న బలం, ఉపాధ్యాయ వర్గాల్లో ఆదరణ లాంటి లెక్కలు చూసుకుంటూ కసరత్తు చేస్తోందట పీసీసీ. ఇప్పటికే ఈ సీటులో సిపిఎం అనుబంధ ఉపాధ్యాయ సంఘం ఎమ్మెల్సీ ఉన్నారు. తిరిగి సీటు వారికే ఇస్తారా? లేక కాంగ్రెస్ తరపున అభ్యర్థిని నిలబెడతారా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదట. దీనిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌తో కలిపి కమిటీ వేస్తారన్నది ఏఐసీసీ వర్గాల సమాచారం. నిర్ణయం ఫైనల్ అయ్యాక జిల్లాల వారీగా సీనియర్ లీడర్స్‌కు బాధ్యతలు అప్పగించే ప్లాన్ ఉన్నట్టు సమాచారం. కమ్యూనిస్ట్‌లతో సంబంధం లేకుండా నేరుగా తామే పోటీ చేసేట్టయితే…మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ.. విధేయులుగా ఉన్న వారికే అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా సీట్లు త్యాగం చేసిన వారు, పక్క పార్టీల నుండి వచ్చిన వారు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారట.
మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద కసరత్తే చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్న పట్టు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారట కాంగ్రెస్ పెద్దలు. ఇక అటు కమలం పార్టీది డిఫరెంట్ స్టోరీ. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, ప్రకటన అంటూ కొన్నాళ్ళు హడావిడి చేసిన తెలంగాణ బీజేపీ ఆ తర్వాత చల్లబడిపోయింది. అయితే… ఇది వ్యూహాత్మకమా అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. బలాబలాలతో నిమిత్తం లేకుండా టీచర్, గ్రాడ్యుయేట్ రెండు సీట్లలో పోటీ చేయాలని డిసైడ్ అయింది బీజేపీ. అభ్యర్థుల ఎంపికపై కూడా ప్రాధమిక చర్చ జరగడంతో…ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకున్నారు ఆశావహులు. టిక్కెట్ రేస్‌లో కొన్ని పేర్ల విషయంలో గట్టి ప్రచారమే జరిగింది. దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసినట్టేనని, ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా అప్పట్లో చెప్పారు బీజేపీ పెద్దలు. ఒక కమిటీ వేసి ఎన్నికలు జరిగే ప్రాంతాల జిల్లాల అధ్యక్షుల అభిప్రాయం కూడా తీసుకుంది పార్టీ. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా…, రేపో మాపో అని పార్టీ పెద్దలే చెప్పినా….. ఇప్పటి వరకు నిర్ణయం మాత్రం బయటికి రాలేదు. ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ఓటర్ల నమోదులో జాగ్రత్తలు తీసుకుని లైన్ క్లియర్ చేసుకుందామని అనుకున్నారట ఆశావహులు. కానీ… అంత హడావిడి చేసి ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు బీజేపీ పెద్దలు. అసలు ఎందుకు అలా జరిగిందో, తిరిగి ఎప్పుడు ప్రకటిస్తారో అర్ధంగాక బుర్రలు గోక్కుంటున్నారట పార్టీ నేతలు. అయితే ఎవరికి వారు ముందే అభ్యర్థుల్ని ప్రకటిద్దామని అనుకున్నా… ఆ తర్వాత అవతలి వాళ్ళని చూసి మనం ఫైనల్ అవుదామని అనుకోవడంతో రెండు పార్టీల నిర్ణయాలు వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ పోటీలో ఉంటుందా, లేక కమ్యూనిస్ట్‌లకు సపోర్ట్ చేస్తుందా అన్న విషయంలో క్లారిటీ వచ్చాక, అటు బీఆర్‌ఎస్ వైఖరి ఏంటో తేలాక తాము నిర్ణయం తీసుకోవాలని కమలం పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఇలా ప్రధాన పార్టీల నాయకులు ఎవరికి వారు అవతలి వాళ్ళ వ్యూహం ఏంటో చూద్దామని అనుకోవడంతో… తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది.