Site icon NTV Telugu

Congress : తెలంగాణలో కాంగ్రెస్ లో రెడ్లకు ప్రాధాన్యత తగ్గుతుందా..?

Congress Otr

Congress Otr

కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం మీద ఆ సామాజికవర్గం అలకబూనిందా? ఎప్పుడూ పైచేయిగా ఉండే…. మమ్మల్ని ఇప్పుడు పట్టించుకోవడం లేదంటూ నారాజ్‌ అవుతున్నారా? ఇటీవల జరిగిన పరిణామాలను ఆ కుల పెద్దలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారా? అధికార పార్టీ మీద కోపంగా ఉన్న ఆ సామాజికవర్గం ఏది? ఎక్కడ తేడా కొట్టింది? తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంటేనే…. రెడ్ల పార్టీ అని ఓ ముద్ర ఉంది. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే విస్తృతాభిప్రాయం. లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా… ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ ఎప్పుడూ… కాంగ్రెస్ పార్టీకే అండగా ఉంటుంది. అలాగే…. పార్టీలో కూడా రెడ్డి నాయకులదే పైచేయిగా నడుస్తూ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయినా… విభజన తర్వాత తెలంగాణలో అయినా… ఇది అనాదిగా వస్తున్నదే. తెలంగాణలో కూడా ఇప్పటిదాకా జరిగిన అన్ని పరిణామాల్లో రెడ్డి నేతలదే పైచేయి అయిందిగానీ…… ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందా అన్న అనుమానాలు వస్తున్నాయట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత… సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా ఇవ్వాలని డిసైడ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా మాల, మాదిగ, బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేసింది ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ పదవుల భర్తీ అయినా…. అందులో కచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉండేది. కానీ…తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో రెడ్లకు చోటు లేకుండా పోయింది. దీంతో ఆ సామాజికవర్గం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఆశావహుల్లో రెడ్డి నాయకులే ఎక్కువగా ఉండటంతో… అసంతృప్త స్థాయి కూడా ఎక్కువగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది రోజురోజుకూ పెరిగిపోతున్న క్రమంలో… మరో కొత్త వాదన వినిపిస్తోంది పార్టీ వర్గాల్లో. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరిగే విస్తరణలో రెడ్లకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందని అంటున్నారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీ కూడా జరిగింది. ఉపాధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల భర్తీలో కూడా జనాభఆ ప్రాతిపదికన తీసుకున్నారు. ఇందులో 68 శాతం బీసీ, ఎస్సీ, మైనార్టీలకు కేటాయించారు. అంతవరకు బాగానే ఉందిగానీ…. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కొందరు పార్టీ నాయకులు. సామాజిక న్యాయం చేయాలన్న ఆలోచన మంచిదే గానీ… పార్టీకి వెన్నెముకగా ఉన్న సామాజిక వర్గాలను దూరం చేసుకోవడం కూడా మంచిది కాదంటూ సలహాలిస్తున్నారట. అటు సోషల్‌ జస్టిస్‌ పేరుతో కనీసం ప్రభుత్వం కానీ… పార్టీ నాయకత్వం గానీ జనంలోకి వెళ్లి చర్చించే ప్రయత్నం చేయడం లేదు. తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం పనులు చేసుకుంటూ పోతోందిగానీ…. ఆ విషయాన్ని ఆయా వర్గాలకు చేర్చాల్సిన పార్టీ మాత్రం…. ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ తీసుకోలేదు. దీంతో కొత్తగా అమలు చేస్తున్న సామాజిక న్యాయం కారణంగా…. ఏయే వర్గాలు ఎంత బెనిఫిట్ అవుతాయన్న వివరాలు కనీసం ఆ కులాలకు కూడా చేరడం లేదు. ఇలాంటి వాటిని పూర్తిస్థాయిలో చెప్పుకోగలిగినప్పుడే… ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి ఉపయోగం అన్నది నేతల అభిప్రాయం. కానీ… అంతా అలా మాట్లాడుకునే వాళ్ళేగానీ…. క్షేత్ర స్థాయిలో చెప్పే ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చేయడం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది. పార్టీకి వెన్నంటి ఉన్న సామాజిక వర్గాలకు దగ్గరవడం ఒక ఎత్తయితే… మారుతున్న పరిస్థితుల్లో… అనుసరించే వ్యూహాలను జనంలోకి విస్తృతంగా తీసుకుపోవడం మరో ఎత్తు. కానీ… ఆ పని మాత్రం జరగడం లేదని చెప్పుకుంటున్నారు. పార్టీ నాయకత్వం ఆ దిశగా ఆలోచిస్తేనే ఉపయోగం అన్న అభిప్రాయం బలపడుతోంది. సామాజిక న్యాయం పరంగా మెజార్టీ జనాభాకు మెజార్టీ పదవులన్న సూత్రాన్ని పాటిస్తూ…… పార్టీకి వెన్నుదన్నుగా ఉండే కులాలను సంతృప్తి పరచడం కత్తిమీద సామే అయినా… చాలా జాగ్రత్తగా చెయ్యక తప్పదని అంటున్నారు పరిశీలకులు. దీంతో ప్రస్తుతం నారాజ్‌గా ఉన్న రెడ్లను కాంగ్రెస్‌ అధిష్టానం ఎలా సంతృప్తి పరుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

 

Exit mobile version