NTV Telugu Site icon

Off The Record : ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించిన బీజేపీ.?

Bjp Otr

Bjp Otr

ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై బిజెపి కసరత్తు ప్రారంభించిందా ? టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రైవేట్ విద్యాసంస్థల అధిపతిని ప్రతిపాదించడం ఖాయమేనా ? ప్రైవేట్‌ విద్యా సంస్థల అధిపతిని రంగంలోకి దించడం వెనుక ఆర్థికబలం, అంగబలం కారణమా ? కార్పొరేట్‌ విద్యాసంస్థల అధినేతకు టికెట్‌ ఇవ్వడంపై సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారా ?

తెలంగాణలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై కమలం పార్టీ దృష్టి సారించింది. త్వరలో టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై బీజేపీ చేపట్టిన కసరత్తు ముగిసినట్లు తెలుస్తోంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేట్ విద్యాసంస్థల అధినేత వైపే పార్టీ మొగ్గు చూపినట్లు సమాచారం. కమలం పార్టీ నేతలు కూడా బిగ్‌షాట్‌ విషయంలో సుముఖంగా ఉన్నారట. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్‌-మెదక్…టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు మాత్రం ఆశావహుల పోటీ విపరీతంగా ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మెదక్ జిల్లాకు చెందిన గోదావరి అంజి రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రఘునాథరావుతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావ్ ప్రధానంగా రేసులో ఉన్నారు. గోదావరి అంజిరెడ్డి, రఘునాథరావు…ఈ సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రేసులో ఉన్నవారి పలుకుబడి, ఆర్థిక స్థితిగతులను అంచనా వేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్‌-మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి… గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మామిడి సుధాకర్ రెడ్డి, విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీగా ఏవీఎన్ రెడ్డికి అవకాశం ఇచ్చామని…మరోసారి కార్పొరేట్ విద్యాసంస్థలకు చెందిన వారికే కేటాయిస్తే విమర్శలు వచ్చే అవకాశముందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన బీజేపీ…ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలాని భావిస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలపై కమలనాథులు కన్నేశారు. తెలంగాణలో వచ్చే ఏడాది మార్చి నాటికి మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో రెండు టీచర్, ఒకటి గ్రాడ్యుయేట్ స్థానాలు ఉన్నాయి. వాటి కోసం ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్‌-మెదక్ టీచర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికీ ఎన్నిక జరగాల్సి ఉంది. కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ జిల్లాల్లో తమకు గట్టి పట్టుందని…ఆ రెండు సీట్లలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ పక్కా ప్రణాళికలు రచిస్తోంది. పట్టున్న చోట 10 మందికిపైగా ఆశవహులు ఉంటే.. వరంగల్-ఖమ్మం-నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ టికెట్‌కు మాత్రం పోటీ పెద్దగా లేదు. ఈ స్థానం కోసం ఉపాధ్యాయ సంఘం లీడర్‌గా పని చేసిన వ్యక్తితో పాటు సంఘ్ పరివార్‌కు చెందిన మరో టీచర్ పోటీ పడుతున్నారట. పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వోత్తమ్ రెడ్డి, సంఘ్ పరివార్‌కు చెందిన టీపీయూఎస్ నాయకుడు సాయిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరి బీజేపీ నేతలు రచిస్తున్న వ్యూహాలు ఫలిస్తాయా ? లేదా? అన్నది వేచి చూడాల్సిందే..!

Show comments